
* ఛత్రపతి విమానాశ్రయంలో పట్టుకున్న ఎన్ఐఏ
ఆకేరున్యూస్: పహల్గాం ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.తాజాగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్‌కు వచ్చిన ఐసిస్ సభ్యులు అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్‌వాలా, తల్హా ఖాన్‌లను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద వీరు అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో ఇమిగ్రేషన్ బ్యూరో అధికారులు అడ్డుకున్నారు. ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇద్దరు నిందితులను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 2023లో మహారాష్ట్రలోని పుణేలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీలు) తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో స్థానిక పోలీసులు ఇప్పటికే వీరిని గాలిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో వీరు భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్‌తో దేశంలో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచించినట్లు వెల్లడిరచారు. అదే ప్రదేశంలో స్లీపర్ సెల్స్‌కు బాంబు తయారీ శిక్షణ వర్క్‌షాప్‌ను నిర్వహించారని అధికారులు తెలిపారు. వారిని పట్టుకోవడానికి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించినట్లు- తెలుస్తోంది. గత రెండేళ్లుగా పరారీలో ఉన్న వీరు భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో ముంబయికి రావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 10మంది ఐసిస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే భారత ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడం కోసం ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి ఏజెన్సీ చేస్తున్న ప్రయత్నాలలో ఈ అరెస్టులు ఒక ప్రధాన ముందడుగని తెలిపారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ బృందాలు ఉగ్రవాదుల జాడ కోసం జమ్మూకశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నాయి. శనివారం స్థానిక అధికారులతో కలిసి ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా, శ్రీనగర్, గండర్బాల్, బారాముల్లా సహా 10 ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్‌లోని బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థకు చెందిన 15 ప్రదేశాలపై ఎన్ఐఏ బృందాలు దాడులు చేశాయి.
……………………………………………