
* ఏడుపాయలలో రెండో రోజు శివరాత్రి ఉత్సవాలు
ఆకేరు న్యూస్, మెదక్ : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయానికి (EdupayalaVanadurga Bhavani temple) గురువారం కూడా భక్తులు పోటెత్తారు. రెండో రోజు మహా శివరాత్రి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఏడుపాయల మహా జాతర ప్రధానంగా మూడు రోజులు జరుగుతుంది. ఉత్సవాల సందర్భంగా రెండో రోజు బండ్లు, బోనాలు ఊరేగించారు. తెల్లవారు జామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడుపాయల ఆలయం వద్ద అమ్మవారికి వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు (Devotees) భారీగా తరలి వస్తుండటంతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు మెచ్చే కోరిన కోరికలు తీర్చే దేవతగా పిలిచే వనదుర్గ అమ్మవారి జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర (Maharastra) నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తులు ఆలయంలో జాగారాలు చేసేందుకు ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. జాతర సందర్భంగా వనదుర్గా భవాని మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించారు. మంజీరా నది పాయలలో ప్రత్యేకంగా శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్ ఏర్పాటుచేశారు.
………………………………