![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/1739454147988-1024x682.jpg)
* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: క్రమం తప్పకుండా విజలెన్స్ కమిటి సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రెవిన్యూ, డిఆర్డీఓ, మహిళా వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విద్యా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కెజిబివి పాఠశాలల సంక్షేమ శాఖల అధికారులు, పౌర సరఫరాల సంస్థ డిఎం, చౌక ధరల దుకాణాల అధ్యక్షుడు తదితరులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలాల్లో మధ్యాహ్న భోజన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ అధికారులు మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో విద్యార్థులకు పరి శుభ్రమైన నాణ్యమైన భోజనం అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఏదైనా అక్రమ చర్యలు గమనించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అందుకు భాద్యత సంబంధిత శాఖల అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. కాటారం, భూపాలపల్లి డివిజన్లులో విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. విజిలెన్స్ టీంలు ప్రతి రెండు నెలలకు సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువులు సరఫరాను పర్యవేక్షణ చేసేందుకు టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని, అక్రమాలకు పాల్పడిన డీలర్లపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే బియ్యంలో నాణ్యతను పరిశీలించాలని, నాణ్యతలేని బియ్యాన్ని తిరస్కరించాలని ఆయన సూచించారు. సామాన్లు భద్రపరుచు స్టోర్ రూం, వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. బియ్యం నిల్వ చేసే స్టోర్ లో ఎలుకలు, క్రిమి కీటకాలు దరిచేరకుండా జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, డిఆర్డిఓ నరేష్, పౌర సరఫరాల సంస్థ డిఎమ్ రాములు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య, విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, బీసీ సంక్షేమ అధికారి శైలజ, ఎస్టి గురుకుల పర్యవేక్షణ అధికారి జీవరత్నం, డీలర్ల సంగం ప్రెసిడెంట్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
………………………………………