– రూ.3,446 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
– గ్రేడ్ సెపరేటర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం
– ఆర్ఓబీలు/ఆర్‌యూబీలు
– ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా పనులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతటా సంబురాలు నిర్వహిస్తోంది. ఏడాది కాలంలో తాము చేపట్టిన పనులను ప్రజలకు వివరిస్తోంది. కొన్ని ప్రాంతాలకు మరిన్ని వరాలను ప్రకటిస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ.3,446 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. 19 వంతెనలు, ఆరు రహదారి విస్తరణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవాల సభలో వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
హైదరాబాద్ రైజింగ్
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇప్పటి వరకు మహానగరంపై అంతగా దృష్టి సారించలేదు. ఇప్పుడు విజయోత్సవాల సందర్భంగా భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ రైజింగ్ పేరిట ప్రణాళికలు రచించింది. విభాగాల వారీగా అభివృద్ధి చేపట్టనున్నారు. జంక్షన్ల వద్ద సిగ్నల్ చిక్కులు లేకుండా వంతెనలు, అండర్‌పాస్‌లు, రైల్వే ట్రాక్‌ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యుబీ)లు, గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం, రహదారుల విస్తరణ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
హెచ్-సిటీ.. అభివృద్ధిలో మేటి..
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా రహదారులు, వరద నీటి నిర్వహణ వ్యవస్థల మెరుగుదలకు ప్రభుత్వం దృష్టి సారించింది. 580 కోట్ల రూపాయల వ్యయంతో జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ ఎంట్రన్స్, జూబ్లీచెక్‌పోస్ట్, రోడ్ నంబర్-45 జంక్షన్ల వద్ద గ్రేడ్ సెపరేటర్, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఖాజాగూడ, ఐఐఐటీ, విప్రో జంక్షన్లలో సుమారు వెయ్యి కోట్లతో మల్టీ లెవల్ వంతెన/గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి ప్రణాళికలు రచించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇవే కాదు.. రూ.510 కోట్లతో ఫిల్మ్‌నగర్, అగ్రసేన్, కేన్సర్ ఆస్పత్రి జంక్షన్ల వద్ద గ్రేడ్ సెపరేటర్, అండర్‌పాస్‌లు, రూ.339 కోట్ల వ్యయంతో ఓవైసీ ఆస్పత్రి వంతెన నుంచి సంతోష్‌నగర్ వైపు వెళ్లేందుకు డౌన్ ర్యాంపు నిర్మాణం, రూ.398 కోట్లతో రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ వంతెన/గ్రేడ్ సెపరేటర్లు, రూ.210 కోట్లతో ఆర్కే పురం ఆర్ఓబీ, రూ. 200కోట్లతో మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్, కాటేదాన్ జంక్షన్ల మీదుగా ఆరు లేన్ల వంతెన నిర్మాణంతో పాటు మరెన్నో ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు/శంకుస్థాపనలు చేశారు.
……………………………………..