Huzurabad dumping yard NGT
* డంపింగ్ యార్డ్ రద్దు చేయకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తాం
* హుజురాబాద్‌ను మరో జవహర్ నగర్ కానివ్వం
* ప్రభుత్వం వేస్ట్ టు ఎనర్జీ పాలసీని తీసుకురావాలని డిమాండ్
*కరీంనగర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
ప్రభుత్వం హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజలతో కలిసి చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల నిరసన చూస్తుంటే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తోందని, డంపింగ్ యార్డు పేరుతో ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపిందని, సొంతంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా టెండర్లు పిలుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
డంపింగ్ యార్డ్ లను ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించాలని, ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తున్నారని డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని వినోద్ కుమార్ అన్నారు. ప్రైవేటు సంస్థల ద్వారా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెడతామంటూ మాయమాటలు చెబుతున్నారని, భూ సేకరణ వెనుక బ్యాంకు అప్పుల కోసం చేస్తున్న జిమ్మిక్కులు ఉన్నాయని విమర్శించారు. హుజురాబాద్‌ను మరో జవహర్ నగర్లా మార్చి చెత్త కుప్పగా మారుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జపాన్‌లోని టోక్యో నగరంలో ఉన్న తరహా ఆధునిక టెక్నాలజీని వాడాలని లేదా వేస్ట్ ఎనర్జీ పాలసీని తీసుకురావాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రజలు తమ దీక్షను కొనసాగించాలని, డంపింగ్ యార్డ్ విరమించుకుంటున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి పత్రిక ముఖంగా ప్రకటన చేయాలని మాజీ ఎంపీ డాక్టర్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
