
* నేటి సాయంత్రం మోగనున్న సైరన్లు
* అనివార్యమైతే ప్రజలు ఏం చేయాలి..
* నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్
* 50 ఏళ్ల తర్వాత మరోసారి..
* తెలంగాణలో హైదరాబాద్.. ఏపీలో విశాఖపట్నంలో..
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదుల దాడిలో పాక్ పాత్ర ఉందని నమ్ముతున్న భారత్.. ప్రతీకార చర్యలను ఇప్పటికే మొదలుపెట్టింది. పలు ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈక్రమంలో పాకిస్తాన్ కూడా బదులిచ్చేందుకు సిద్ధమంటూ ప్రకటనలు చేస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం త్రివిధ దళాలతో నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. వారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఆత్మ విశ్వాసం నింపుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఒకవేళ యుద్ధం అనివార్యమైతే.. పౌరులు ఏం చేయాలో అవగాహన కల్పించేందుకు నేడు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పలు రాష్ట్రాలు, నగరాల్లో నేటి సాయంత్ర సైరన్లు మోగనున్నాయి.
50 ఏళ్ల తర్వాత మరోసారి..
ఇటీవలి కాలంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మాక్ డ్రిల్స్ ముఖ్యమని కేంద్రం భావిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. ఈ డ్రిల్స్‌లో వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరికల సైరన్లు, దాడి జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలనే విషయంలో దేశ పౌరులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. 1971 తరువాత మరోసారి ఇలాంటి మాక్ డ్రిల్స్‌ను చేపడుతున్నారు. ఇప్పటి వరకూ ఆ అవసరం రాలేదు. 1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం (బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం) సమయంలో మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. 1962లో చైనాతో, 1965, 1971లో పాకిస్తాన్‌తో భారత్ పూర్తి స్థాయి యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఈ డ్రిల్స్‌ను చేసినట్లు ప్రముఖ కథనాల ద్వారా తెలుస్తోంది. మాక్ డ్రిల్స్ సందర్భంగా అప్పుడు భారత్ సైరన్లు మోగించిందని, ఆ సమయంలో ప్రజలు కొద్దిసేపు పాటు తమ ఇళ్లలోని లైట్లను ఆపివేశారని ‘ఫస్ట్ పోస్ట్’ తన కథనంలో పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడంటే..
మాక్ డ్రిల్స్ నిర్వహించే జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్ డీఓ, మౌలాలీ ఎన్ ఎఫ్‌సీలో మాక్ డ్రిల్స్ చేపట్టనున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీ ఆర్ ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలో అవగాహన కల్పిస్తారు. ఈ మాక్ డ్రిల్స్ లో 12 సివిల్ డిఫెన్స్ సంస్థలు పాల్గొననున్నాయి.
ప్రజలు ఏం చేయాలంటే..
“ఆపరేషన్ అభ్యాస్” పేరుతో నిర్వహించనున్న మాక్ డ్రిల్స్‌లో భాగంగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ డ్రిల్ నిర్వహిస్తారు. ఈసందర్భంగా 4.15 గంటలకు నగరమంతా సైరన్లు మోగించనున్నారు. అన్ని కూడళ్లలోనూ సుమారు 2 నిమిషాల పాటు సైరన్లు మోగనున్నాయి. ఆ ఈ సమయంలో ఇళ్లలో, సంస్థల్లో ఉన్న లైట్లను, స్టవ్ లను కొంతసేపు ఆపివేయాలని ఆదేశాలు సూచించారు. ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రజలను సురక్షితంగా ఎలా తరలిస్తారనే దానిపైనా అవగాహన కల్పించనున్నారు.
………………………………………………………