
– తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం
– హైదరాబాద్‌లో సమావేశం పెట్టి డిమాండ్
– పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో విశ్వకర్మలకు అన్యాయం
– కాంగ్రెస్ సర్కారు అయినా న్యాయం చేయాలని వినతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిరంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపించి, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ (jayasanker) పేరును వరంగల్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టుకు పెట్టాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిగిల్ల శ్రీనివాసాచారి, శిలా శిల్పి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ శిల్పిలు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించి ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని తెలంగాణ ( telangana) విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం డిమాండ్ చేసింది. అంతేకాదు.. ట్యాంక్‌బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి, వర్థంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సంఘం నేతలు కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ (brs) హయాంలో విశ్వకర్మలకు అన్యాయం చేశారని, కాంగ్రెస్ సర్కారు అయినా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విశ్వకర్మ కార్పొరేషన్‌కు వెంటనే పాలక మండలి ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కోరారు.
……………………………………………………………….