 
                * వరద తగ్గినా బురదతో సతమతం
* ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు అష్టకష్టాలు
* నిత్యావసరాలు కొట్టుకుపోవడంతో ఆవేదన 
* ముఖ్యమంత్రి ఆదుకోవాలని వినతి
ఆకేరు న్యూస్, వరంగల్ : ఏ ఇల్లు చూసినా బురదమయమే. పాడైన వస్తువులే. బాధితులను కదిపితే కన్నీళ్లే. మొంథా తుపాను వరంగల్, హనుమకొండను ఆగమాగం చేశాయి. వరద కాలనీలను ముంచేసింది. ఇళ్లలోకి కూడా చొచ్చుకొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లడంతో రోడ్లు చెరువులుగా మారాయి. ఉప్పెనలా విరుచుకుపడిన మెుంథా తుపాను వరంగల్ వాసులను కన్నీళ్ల పాలుచేసింది. తీరం దాటిన తర్వాత తుపాన్ ప్రభావంతో నగరమంతా కకావికలమైంది. ఊరు ఏరు ఇప్పటికీ వాగులను తలపిస్తున్నాయి. వరంగల్- హనుమకొండ జంటనగరాల్లో శివనగర్, మైసయ్యనగర్, సమ్మయ్య నగర్, డీకేనగర్, ఎన్ఎన్ నగర్, సరస్వతికాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్ సహా తదితర 40కిపైగా కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి.
దయనీయ పరిస్థితులు
వరంగల్, హనుమకొండలో ఇప్పటికీ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గినా బురద, చెత్తతో కాలనీలు నిండిపోయాయి. విలువైన వస్తువులు, నిత్యావసరాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద మిగిల్చిన బురదను శుభ్రం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వరదకు బైకులే కాదు.. కార్లూ కొట్టుకుపోయాయి. లోపలకు నీళ్లు చేరి పాడైపోయాయి. వరద బాధితుల కంట కన్నీళ్లు వరదలా వస్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఆపదతో అల్లాడిపోతున్నారు. కొందరైతే సర్వం కోల్పోయారు. ఇంట్లోని పరుపులు, ఫ్రిడ్జ్ లు కూడా కొట్టుకుపోయాయని తీవ్రంగా రోదిస్తున్నారు. భద్రకాళి ఆలయం సమీపంలో వరద తగ్గింది. కానీ, రోడ్డంతా కొట్టుకుపోయింది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. భద్రకాళి బండ్ దగ్గర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. గుట్టలుగా ఇసుక, కంకర పేరుకుపోయాయి. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రాణ నష్టం
బొంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో సమ్మయ్య నగర్, గోకుల్ నగర్, సంతోషిమాత కాలనీ, పరిమళ కాలనీ, కాకతీయ కాలనీ, రాయపుర ప్రాంతాల్లో నీరు చొచ్చుకుపోయింది. వరదల వల్ల జనజీవనం స్తంభించింది. అనేకమంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. హనుమకొండ, కాజీపేట వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల వల్ల ఏడుగురు మరణించారని, ముగ్గురు గల్లంతయ్యారని తెలుస్తోంది. హనుమకొండ జిల్లా కొత్తపల్లికి చెందిన నాగేంద్రం (58) కల్వర్టులో పడి మృతి చెందాడు. వరంగల్ జిల్లా గుట్టకిందిపల్లెకు చెందిన అనిల్‌కుమార్ (30) మైసయ్యనగర్ వద్ద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్ఆర్నగర్లో గుడిసెలో ఉన్న అడెపు కృష్ణమూర్తి (65) మంచంపై నుంచి వరద నీటిలో పడి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన సంపత్ (30) బుధవారం రాత్రి మొట్లతండా పెద్దచెరువు మత్తడిలో కొట్టుకొని పోయి మృతి చెందాడు.
ముఖ్యమంత్రీ.. మీరే మాకు దిక్కు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాసేపట్లో వరంగల్ నగరంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. నీట మునిగిన కాలనీలను ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ను పర్యటిస్తారా లేదా చూడాలి. అయితే.. ముఖ్యమంత్రి తమ కష్టాలను ప్రత్యక్ష్యంగా చూసి తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమకు సర్కారు అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి ఎటువంటి సహాయం ప్రకటిస్తారో చూడాలి.
……………………………………………………

 
                     
                     
                    