MP Kadiyam Kavya NH 163 Service Roads
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
యాదాద్రి–వరంగల్ మధ్య జాతీయ రహదారి -163పై అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163)లోని యాదాద్రి–వరంగల్ నాలుగు లేన్ల విస్తరణ పనుల సమయంలో నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, స్టేషన్ ఘన్పూర్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల పరిధిలో సర్వీస్ రోడ్లు నిర్మించినప్పటికీ, వాటి మధ్య పలు ప్రాంతాల్లో అనుసంధాన లింకులు మిగిలిపోయాయని తెలిపారు. జనగాం సమీపంలోని. 87/200 కి.మీ నుంచి నిడిగొండ వరకు, నిడిగొండ నుంచి రఘునాథపల్లి వరకు, రఘునాథపల్లి నుంచి చాగల్ వరకు, చాగల్ నుంచి స్టేషన్ ఘన్పూర్ వరకు, స్టేషన్ ఘన్పూర్ నుంచి చిన్నపెండ్యాల వరకు, చిన్నపెండ్యాల నుంచి కరుణాపురం వరకు ఉన్న సర్వీస్ రోడ్లలో లింకులు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య యాదవ్ కు వివరించారు.
ఈ కారణంగా స్థానిక వాహనాలు ప్రధాన జాతీయ రహదారిపైకి రావాల్సి వస్తోందని, దీంతో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పాటు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. నాలుగు లేన్ల విస్తరణ సమయంలోనే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పూర్తయినందున, మిగిలిన లింకులను నిర్మించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
ప్రజల భద్రత, స్థానిక రవాణా సౌలభ్యం, గ్రామాల మధ్య మెరుగైన అనుసంధానం కోసం అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎన్హెచ్ఏఐ చైర్మన్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
