* ఘరానా దొంగ అరెస్ట్
* భారీగా బంగారం స్వాధీనం
* పోలీస్ లను అభినందించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్, వరంగల్ : అయ్యో పాపమని ఉద్యోగం ఇస్తే.. ఆశ్రయం ఇచ్చిన యజమాని షాపుకే కన్నం వేశాడో ప్రబుద్దుడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించి పోలీస్‌లకు చిక్కాడు. బంగారం కరిగించే షాపులో నమ్మకం అనే ముసుగులో పనిచేస్తూ అదును చూసి భారీ మొత్తంలో బంగారాన్ని చోరీ చేసిన ఘరానా దొంగను సిసిఎస్ మరియు మట్వాడా పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. పోలీసులకు పట్టుబడిన ఈ దొంగ నుంచి పోలీసులు సుమారు రూ. 52 లక్షల విలువగల 700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Ambar Kishor Jha) వివరాలను వెల్లడించారు. మహరాష్ట్ర సాంగ్లీ జిల్లా, సాల్సింగే తాలూకా, భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సురేష్ లక్ష్మన్బాద్ ఒంటరిగా జీవిస్తూ బంగారం వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే అదాయంతో నిందితుడు త్రాగుడు, సట్టా,మట్కా లాంటి జూదాలకు బానిసగా మారి అప్పుల పాలయినాడు. పిజ్జా వ్యాపారాన్ని కొద్ది రోజులు నిర్వహించి జల్సాల కారణంగా నిందితుడు మరోమారు ఈ వ్యాపారంలో నష్టపోయాడు. తాను చేసిన అప్పుల తీర్చాలంటే ఎదైనా బంగారం దుకాణంలో కొద్ది రోజులు నమ్మకంగా పనిచేసి అదును చూసి షాపులోని పెద్ద మొత్తంలో చోరీ చేసి దానిని అమ్మగా వచ్చే డబ్బుతో అప్పులు తీర్చి జల్సాలు చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు.
నమ్మకస్తుడిగా నటించి…
వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలో బంగారం కరిగించే బట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంజయ్ వద్ద నిందితుడు గత మే నెల 24తేదిన పనిలో చేరాడు. కొద్ది రోజులు సురేష్ లక్ష్మణ్ బాద్ ఎంతో నమ్మకంతో పనిచేస్తూ దుకాణం యజమానికి పూర్తి నమ్మకస్తుడిగా మారడంతో దుకాణం యజమాని షాపు సంబంధించిన తాళాలు అందజేసి బయటికి వేళ్ళేవాడు.ఈ క్రమంలో నిందితుడు పనిచేస్తున్న దుకాణంలో కరిగించేందుకు పెద్ద మొత్తంలో బంగారం షాపులోకి రావడంతో నిందితుడు షాపులో వున్న బంగారాన్ని చోరీ చేసేందుకు సిద్దపడ్డాడు. గత నెల జూన్ 14 వ తేదిన షాపు యజమాని సంజయ్ పనిపై బయటకి వెళ్ళడంతో నిందితుడు షాపులోని సిసి కెమెరాలను అపేసి దుకాణంలో వున్న ఎనిమిది వందల గ్రామాల బంగారాన్ని చోరీ చేసిన అక్కడి నుండి పారిపోయినాడు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ రవి అధ్వర్యంలో సిసిఎస్ ఇన్ స్పెక్టర్ అబ్బయ్య, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్ గోపిలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసుల వద్ద వున్న టెక్నాలజీ వినియోగించుకోని పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు.
* చోరీ సొత్తును అమ్మేందుకు ప్రయత్నించి ..
సురేష్ చోరీ సోత్తును అమ్మేందుకు జులై 18వ తేదిన సికింద్రబాద్ నుండి విజయవాడకు రైలులో ప్రయాణిస్తున్నట్లుగా విశ్వసనీయ సమచారం పోలీసులకు రావడంతో వరంగల్ రైల్వే స్టేషనలో నిఘా పెట్టారు. నిందితుడు ఫ్లాట్‌ఫారంపై మంచినీటి బాటిల్ కోనుగోలు చేస్తూండగా అదుపులోకి తీసుకొని తనీఖీ చేయగా చోరీ సోత్తును గుర్తించారు. నిందితుడు తన స్వగ్రామానికి వెళ్ళి మూడు రోజుల అనంతరం తన వద్ద వున్న ముద్ద బంగారాన్ని అమ్మేందుకు కష్టమవుతుందని పూణేలోని నస్రాపూర్‌లో బంగారాన్ని కరిగించే బట్టి వ్యాపారం నిర్వహిస్తున్న తన మిత్రుడైన సూరజ్ తానాజీ యాదవ్ ఆలియాస్ పింటు వద్ద చోరీ సోత్తు బంగారాన్ని కరిగించి వంద గ్రాముల చొప్పున ఎనిమిది బిస్కెట్లుగా మార్చి అందులో వంద గ్రాముల బంగారాన్ని సూరజ్ తానాజీ యాదవ్ ఆలియాస్ పింటుకి అమ్మినాడు.మిగిలిన 700 గ్రాముల బంగారాన్ని నిందితుడు నాగ్‌పూర్, అమరావతి, ముంబాయి,పూణే, హైదరాబాద్ ప్రాంతాల్లో అమ్మేందుకు యత్నించగా బంగారం అమ్ముడు పోక పోవడంతో నిందితుడు బంగారాన్ని విజయవాడలో అమ్మేందుకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. అలాగే నిందితుడు తమ స్నేహితుడికి అమ్మిన వంద గ్రాముల బంగారాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు.
* పోలీస్‌లను అభినందించిన సీపీ ..
నిందితుడిని సకాలంలో పట్టుకోని భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనబరిచిన సెంట్రల్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ రవి, సిసిఆర్బి ఏసిపి డేవిడ్‌రాజు, వరంగల్ ఏసిపి నందిరాంనాయక్, సిసిఎస్,మాట్వాడా ఇన్స్‌స్పెక్టర్లు అబ్బయ్య, గొపి, ఏఏఓ సల్మాన్‌పాషా,మట్వాడా క్రైమ్ ఎస్.ఐ విఠల్, ఏ.ఎస్.ఐ శివకుమార్,హెడ్‌కానిస్టేబుళ్ళు నజీం పాషా, ఆహ్మద్, జంపయ్య,కానిస్టేబుళ్ళు మధుకర్, చంద్రశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది ప్రవీణ్, నగేష్‌లను పోలీస్ కమిషనర్ అభినందించారు.
————————–