*స్కూల్ బస్సు – ట్రాక్టర్ ఢీ
*ఇద్దరి మృతి, 15 మందికి గాయాలు
ఆకేరు న్యూస్, పర్వతగిరి:దైవ దర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి తిరిగివస్తున్న ఆ కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. స్కూల్ బస్సు మరియు ట్రాక్టర్ బలంగా ఢీకొన్న ఘటనలో ఒక చిన్నారి సహా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు,మొక్కులు చెల్లించుకోవడానికి ఆదివారం బంధువులతో కలిసి ట్రాక్టర్ లో అన్నారం దర్గా కి వెళ్లారు. సోమవారం సాయంత్రం ట్రాక్టర్లో తిరిగి వస్తుండగా, పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు వీరి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పండ్ల వ్యాపారి ఇస్మాయిల్ (48), ఐదేళ్ల చిన్నారి రేహాన్ (5) అక్కడికక్కడే మృతి చెందారు.స్కూల్ బస్సులో ఉన్న సుమారు 15 మంది విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.మరణించిన చిన్నారి రేహాన్ కళ్లముందే ప్రాణాలు వదలడంతో అతని తల్లిదండ్రులు ఫయాజ్, వాజిదా కన్నీరుమున్నీరవుతున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు ఎస్సై ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృతుల బంధువులు, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
