AP | బ్రేకింగ్ న్యూస్
* ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు
* చాలా ప్రాంతాల్లో సంపూర్ణ మేఘావృతం
ఆకేరు న్యూస్, డెస్క్ :ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలకు వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ను దాటి ఫ్లాష్ ప్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్ ప్లడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో కూడిన వరదలకు చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. నాలుగు రోజులుగా నెల్లూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. కాలనీలు, బస్తీలే కాదు.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చేశాయి. దీంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అనంతసాగరం, సంగం, చేజర్ల ఆత్మకూరు, మండలాల్లో భారీ వర్షం పడుతోంది. అనంతసాగరం మండలంలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంతసాగరం, ఉప్పలపాడు, ముస్తాపురం దేవరాయపల్లి గ్రామంలో కోత దశలో ఉన్న వరి పంట సుమారు 1500 ఎకరాల వరకు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
