
* స్కూల్ ఫీజుల పెరుగుదలపై తల్లిదండ్రులు గగ్గోలు
* ఏటా 30 శాతానికి పైగా పెంచుకుంటూపోతున్న యాజమాన్యాలు
* భారీగా ఫీజుల పెంపుపై తాజాగా హయత్‌నగర్‌లో నిరసన
* పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : శనివారం.. అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి హయత్‌నగర్‌లోని జీ స్కూల్ వద్దకు భారీ సంఖ్యలో తల్లిదండ్రులు చేరుకుంటున్నారు. స్కూల్ లో ఏదో ఫంక్షన్ అయి ఉంటుందిలే అనుకుంటున్నారు చూసేవాళ్లు. ఇంతలో నినాదాలు.., ఫీ”జులం” నశించాలంటూ ఆందోళన.. ఔను వాళ్లు అందరూ భారీగా పెంచిన స్కూల్ ఫీజులపై నిరసన తెలిపేందుకు వచ్చారు. ఏకంగా 25 నుంచి 30 శాతం పెంచారని, అలా పెంచుకుంటూ పోతే భరించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 10 శాతం పెంచుతామని చెప్పి భారీ స్థాయిలో పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యాజమాన్యం తల్లిదండ్రులతో చర్చలు జరుపుతోంది.
ఈ ఒక్క స్కూల్ మాత్రమే కాదు.. చాలా కార్పొరేట్, టెక్నో స్కూళ్ల ధన దాహం తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీనిపై కొందరు తల్లిదండ్రులు ఆందోళన చేస్తుంటే, మరికొందరు పిల్లల కోసం మౌనంగా భారం భరిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. నర్సరీ నుంచి మొదలు పదో తగరతి వరకూ ఏటేటా రూ.వేలల్లో ఫీజు పెంచుతున్నారు. ఉత్తమ బోధన పేరిట తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వివిధ వసతులు, వస్తువులు తదితర కారణాలు చెప్పి నర్సరీ తరగతులకే రూ.30వేల నుంచి రూ.55వేలు తీసుకుంటున్నారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు డేస్కాలర్/హాస్టల్‌కు రూ.60వేల నుంచి రూ1,00,000 తీసుకుంటున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఫీజులు అధికం.. వసతులు స్వల్పం..
ఈ-టెక్నో, కాన్సెప్ట్, టాలెంట్, ఎక్సలెన్స్ వంటి తోక పేర్లతో గల్లీకో పాఠశాల నెలకొల్పుతూ రూ.వేలల్లో ఫీజులు గుంజుతున్నారు. దీనిని నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు తమకే సంబంధం లేదన్నట్టు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ స్కూళ్లకు రికగ్నిషన్ మాత్రం ఇస్తూ ఫీజులు ఎంత వసూలు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. తల్లిదండ్రులకు పిల్లల ఫీజులు తలకుమించిన భారంగా మారుతున్నాయి. అయినా విద్యా బోధనలో మాత్రం నాణ్యత పాటించడం లేదు. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. దీనినే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అనుకూలంగా మలుచుకుంటూ ఫీజులను ఏటికేడు రూ.వేలల్లో పెంచుతున్నాయి. సగటు కూలీ సైతం తామెంత కష్టపడైనా పిల్లలను ప్రైవేట్ సూళ్లలో చదివిస్తున్నారు. తాము పడుతున్న విధంగా భవిష్యత్తులో తమ పిల్లలు కష్టపడకూడదని ప్రైవేట్ విద్యకు మొగ్గు చూపుతున్నారు. సర్కారు బడుల్లో అన్నీ ఉచితంగా కల్పిస్తున్నా ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిట్ చేస్తున్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ..
విద్యాహక్కు చట్టం ప్రకారం డొనేషన్లు లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన మేకే ఏటా ఫీజులు తీసుకోవాలి. కానీ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలను అస్సలు పాటించడం లేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిగ ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీకి చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లకయితే ప్రభుత్వ గుర్తింపు కూడా లేకుండానే నడిపిస్తున్నారు. రికగ్నిషన్ లేని పాఠశాలల్లో చదివే పిల్లలు భవిష్యత్తులో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల 7వ తరగతి వరకే గుర్తింపు ఉన్నా హైస్కూల్ వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చదివిస్తే విద్యార్థి ప్రైవేట్‌గా చదివినట్టే గానీ రెగ్యులర్ స్టడీ కిందికి రాదు. వేలల్లో ఫీజు కట్టి ప్రైవేట్ సర్టిఫికెట్ తీసుకోవడం అన్న మాట! కాబట్టి తల్లిదండ్రులు ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలోనే పిల్లలను చదివించాలి.
ఏటేటా పెరుగుతున్న భారం
కాన్వెంట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలకయ్యే ఖర్చు ఏటేటా పెరిగి తల్లిదండ్రులకు భారంగా మారుతోంది. గతేడాది కంటే ఈ సారి ఆరేడు వేల నుంచి రూ.15వేల వరకు ఫీజులు పెంచారు. ట్రాన్స్‌పోర్టు గతేడాది రూ.7,000 ఉంటే ఈ సారి రూ.9,000కు పెంచుతున్నారు. బూట్లు, దుస్తులు, టైలు రూ.15వందల నుంచి రెండు వేలు అయ్యేవి. ఈ సారి రూ.2,500లకు పెరిగింది. ఇలా ఏటేటా పిల్లల చదువుల ఖర్చు తల్లిదండ్రులకు భారం అవుతోంది.
……………………………………………………………….