* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. కోరారు. బుదవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పక పాటిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుందని అన్నారు.
నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, స్వీకరించిన నామినేషన్ లను పరిశీలన చేసి నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని, అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు , ప్రజా పతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, డీపీఓ శ్రీధర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
………………………………………………………
