
* రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, ములుగు : ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల ఆవరణలో మాస్టర్ ప్లాన్ తో చేపడుతున్న అభివృద్ధి పనులు 300 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండే విధంగా పనులు చేపడతామని రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ(సీతక్క) మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయకులతో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరిష్ ,దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పూజారులు కలిసి మేడారంలో జరుగుతున్న అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట ఆయన ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం అమ్మవారు గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు .అనంతరం గద్దెల పరిసరాలలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతర సమయం సమీపిస్తున్నందున 90 రోజులలో నే రాతి కట్టడాలతో పనులు పూర్తి చేస్తామన్నారు. మాహ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత కల్పిస్తూ సునాయాసంగా అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని వెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. జంపన్న వాగు కు ఇరువైపులా పదివేల మంది ఉండే విధంగా వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. దైవ కార్యక్రమానికి నిధులు ఎక్కువ అయినా సకాలంలో పూర్తి చేస్తామన్నారు. మరో నాలుగు ఐదు రోజులలో వస్తానని తెలిపారు. మంత్రులు సీతక్క, సురేఖ, స్థానిక ఎస్పీ, కలెక్టర్ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పనులపై పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఎలాంటి లోటు పాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మంత్రులు తదితరులున్నారు.
……………………………………………………..