
* రేవంత్ సర్కార్ భ్రమల్లో ఉంది
*జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి ఒక్కో మహిళకు రూ.55,000 బాకీ పడ్డారని చెప్పారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.44,000 బాకీ ఉన్నారని తెలిపారు. అలానే విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు కానీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాలన్నింటినీ గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ ను కలవడానికి యువత భారీగా తరలివచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. “కేసీఆర్ ప్రభుత్వంలో పారిశుద్ధ్య పనులు రోజూ జరిగేవి అయితే ఇప్పుడు చెత్త తీసేవారే కరువయ్యారని తెలిపారు. మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
………………………………………….