* ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున, ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చనిపోయిన ఆ ఆరు కుటుంబాల సభ్యులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి , ఎమ్మల్యే కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి , ఎమ్మల్యే కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు. 200 రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరు మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు తాము అధికారంలోకి రాగానే సమాధానాలు రాబడతామని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
…………………………………….
