* కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
ఆకేరు న్యూస్, కరీంనగర్: నరేంద్ర మోడీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య వసతి,సౌకర్యాలు కల్పించేందుకే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లాలోని ఏకలవ్య పాఠశాలను కేంద్ర మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. విద్యార్థులు తినే అన్నంలో ప్రతిరోజు రాళ్లు వస్తున్నా యని, టాయిలెట్లు ఉన్నా నీళ్లు రావడం లేదని, విద్యార్థులు బాధపడుతున్నారని, చిన్న చిన్న సమస్యలను పట్టించుకోక పోతే ఎట్లా? ప్రిన్సిపాల్ గా మీరు ఏం చేస్తున్నారని స్కూల్ ప్రిన్సిపాల్ ను స్కూల్,స్టాప్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు. ఆదివాసి, గిరిజన బిడ్డలు అడవికే పరిమితం కాకుండా చదువుల్లో మిగతా వారి పిల్లలతో సమానంగా పోటీ పడుతూ ఉన్నత చదువు లు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రతి ఎంపీ తమ నియోజ కవర్గం పరిధిలో ఉన్న ఏకలవ్య పాఠశాలలను సందర్శించాలనే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో తాను ఇవాళ ఈ పాఠశా లను సందర్శించానన్నారు. తన నియోజకవర్గంలో ఈ మర్రిమడ్ల పాఠశాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో మరో ఏకలవ్య పాఠశాల ఉందన్నారు. వీటిని సందర్శించి ఇక్కడ విద్యార్థులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్య లను తెలుసుకున్నాన్నారు. అవసరమైన సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తానన్నారు. తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని ఇక్కడి పిల్లలలోని నైపుణ్యాన్ని గుర్తించి వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. గిరిజన బిడ్డల చదువుకు పేదరికం అడ్డంకిగా ఉండకూడదని మంత్రి అభిప్రాయపడ్డారు.
…………………………………………