
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
సోషల్‌మీడియా బ్యాన్‌తో మొదలై.. అవినీతిపై పోరుగా మారిన జెన్-z ఉద్యమంతో నేపాల్ అతలాకుతలమైంది. పార్లమెంట్ సహా ప్రభుత్వ భవనాలన్నీ మంటల్లో చెలరేగాయి. కొందరు నేతలను ప్రజలు తన్ని మరీ తరిమేశారు. దీంతో ప్రధాని సహా ప్రముఖ నాయకులందరూ పరారయ్యారు. సోషల్‌మీడియాపై బ్యాన్ ఎత్తేసినా, ప్రధాని రాజీనామా చేసినా అక్కడి ఉద్రిక్తతలు చల్లారలేదు. ఇప్పటికీ నేపాల్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఖాట్మాండు ప్రధాన రహదారుల్లో ఆర్మీ మోహరించి ఉంది. నిరసనలు మళ్లీ మొదలైతే చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది.
తుపాకులతో ఆర్మీ గస్తీ
ఉద్రిక్తతతు చల్లారి సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు బాలేంద్ర షా, సుశీల కార్కి, రాష్ట్రపతి, ఆర్మీ చీఫ్ చర్చలు కొనసాగుతున్నాయి. కొందరు జెన్-జెడ్ నిరసనకారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. సుశీలా కార్కి తాత్కాలిక ప్రధానిగా కొందరు ప్రతిపాదిస్తుంటే, కొందరు మాత్రం ఆమెను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆర్మీ ఎక్కడికక్కడ మోహరించింది. ఎవరైనా ముందు కొస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. కాల్పులకు సిద్ధంగా ఉన్నట్లుగా తుపాకులతో రోడ్లపై పడుకుని మరీ అధికారులు గస్తీ కాస్తున్నారు. ఇప్పుడు కూడా నేపాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడం, ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉండడంతో ఆర్మీ అప్రమత్తంగా ఉంది.
అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే..?
ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాకారణాల రీత్యా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ను హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి ఆర్మీ తరలించింది. ఆయన తరలిన కొద్దిసేపటికే, నిరసనకారులు అధ్యక్షుడి కార్యాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసి, ఆ భవనానికి నిప్పుపెట్టారు. నేపాల్ ఆర్మీ రక్షణలోనే అధ్యక్షుడు ఉన్నారు. ప్రస్తుత ఆయన ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పరిపాలనా కేంద్రం సింఘా దర్బార్, పార్లమెంట్‌తో పాటు ప్రధాన మంత్రి, అధ్యక్షుడి నివాసాల్లోకి నిరసనకారులు చొచ్చుకురావడంతో, స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:24 గంటలకు ప్రధాన మంత్రి కేపీ ఓలీ తన సచివాలయం ద్వారా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు పౌడెల్ ఆమోదించినట్లు అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలను ఓలీకి అప్పగించినట్లు ప్రకటించింది. అయినా ఓలీ ఎక్కడా కనిపించలేదు. ఓలీ దేశం విడిచివెళ్లారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
………………………………………