
* జన జాగృతి కార్యాలయం ప్రారంభంతో కొత్త తరహా చర్చ
* జాగృతికి – బీఆర్ ఎస్ కు సంబంధం ఉందా.?
* కేసీఆర్ కు బీఆర్ ఎస్.. తెలంగాణ జాగృతి రెండు కళ్లు అని ప్రకటన
* కార్యాలయంలో ఎక్కడా కనిపించని బీఆర్ ఎస్ చాయలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
“నాది బీఆర్ఎస్ పార్టీ. నాకెందుకు వేరే పార్టీ. ఉన్న దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు..” అంటూ మీడియాతో చిట్ చాట్ లో ఇటీవల వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమాలను చూస్తుంటే మాత్రం వాటి వెనుక ఏదో బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలు చేపడుతున్న కవిత తాజాగా బంజారాహిల్స్ లో సంస్థ కార్యాలయం ప్రారంభించారు. బీఆర్ ఎస్ అనుబంధంగానే ఇప్పటి వరకు నడుస్తున్న సంస్థ.. ఇటీవల చేపడుతున్న కార్యక్రమాలను చూస్తుంటే ప్రత్యేక కార్యచరణ ఉన్నట్లుగా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక కార్యాలయం ప్రారంభించడం.. అందులో ఒక్క కేసీఆర్ కు తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదన్నట్లుగా అక్కడి వాతావరణం ఉండడం కూడా ఈ అనుమానాలకు తావిస్తోంది.
నాటి నుంచి కార్యాలయం ప్రారంభం వరకూ..
బీఆర్ ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ తీరుపై సూచనలతో పాటు విమర్శలు సైతం చేస్తూ పార్టీ చీఫ్ కేసీఆర్ కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు మీడియాతో చిట్ చాట్, కార్యాలయం ప్రారంభోత్సవం తదితర సందర్భాల్లో ఆమె చేస్తున్న కామెంట్లు కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో రెండు అంతస్థుల తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి వెళ్లిన కొందరు ప్రముఖులకు, మీడియాకు అక్కడి వాతావరణ చూస్తే కవిత తాజా అడుగులు వెనుక ఏదో బలమైన వ్యూహం ఉందన్న చర్చ లేవనెత్తింది. దీనికి కారణం.. ఒక్క కేసీఆర్ ఫొటోలు తప్ప.. పార్టీకి చెందిన ప్రముఖుల ఫొటోలు ఏవీ అక్కడ లేవు. అంతేకాదు.. నాది బీఆర్ ఎస్ పార్టీ అనే చెప్పుకుంటున్న కవిత ఆ పార్టీ తాలూకు జెండాలు కానీ, చాయలు కానీ అక్కడ కనిపించ లేదు. కేసీఆర్ ఫొటోను మాత్రమే తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పైగా ఆమె మాట్లాడుతూ బీఆర్ ఎస్.., తెలంగాణ జాగృతి కేసీఆర్ కు రెండు కళ్లు అని తెలిపారు కానీ రెండూ ఒకే గొడుగు కింద పనిచేస్తాయని పేర్కొనలేదు.
జాగృతి బీఆర్ ఎస్ కు అనుబంధం కాదా?
కవిత లేఖ బహిర్గతం ఎపిసోడ్ కు ముందు యువత, మహిళలు ఇతర ఏ వర్గాల కోసం కార్యక్రమాలు నిర్వహించినా, ఉదాహరణకు తెలంగాణ జాగృతి.. బీఆర్ ఎస్ యువ విభాగం అని పేర్కొనేవారు. కానీ నిన్న ప్రారంభించిన సంస్థ కార్యాలయంలో తెలంగాణ జాగృతి అనే పేరును మాత్రమే పొందుపరిచారు. అలాగే సింగరేణి పార్టీ అనుబంధ సంఘం ఉన్నప్పటికీ సింగరేణి జాగృతి పేరుతో ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయడం, అందుకు కో ఆర్డినేటర్లను కూడా నియమించడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో కింది పోర్షన్ ప్రారంభంలో మాత్రం తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కుడి, ఎడమ పక్కల ప్రొఫెసర్ జయశంకర్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయి ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమర వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. దీనిని బట్టి కవిత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో, కవిత అడుగులు ఎటు పయనిస్తాయో అనేది ఉత్కంఠగా మారింది.
……………………………………….