
* కొచ్చి తరహాలో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశాలు
* ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు
* కొచ్చి ఎయిర్‌పోర్టుపై అధ్యయనం
ఆకేరు న్యూస్, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి : వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ పునరభివృద్ధితో స్థానికంగా రూపురేఖలు మారబోతున్నాయి. ప్రాంత అభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే కేంద్ర సహకారంతో త్వరితగతిన ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మామునూరు విమానాశ్రయంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, సత్వరమే ఎయిర్‌పోర్టు డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించారు. కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు మాదిరిగా నిర్మించాలని అభిలాషించారు. ఆ దిశగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ఆ దిశగానే అధికారులు అడుగులు వేస్తున్నారు.
కొచ్చీ విమానాశ్రయం ఇలా..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొచ్చి తరహాలోనే ఎయిర్ పోర్టు ఉండేలా డిజైన్ రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈక్రమంలో కొచ్చి ఎయిర్ పోర్టును పోలిన విధంగానే వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొచ్చిలో అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్ పోర్టును తీర్చిద్దిదారు. అక్కడ 1213 ఎకరాల్లో కట్టారు. 1999 మే 25న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు. తొలుత దేశీయ విమానాల రాకకు టెర్మినళ్లను నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరణ చేశారు. ప్రస్తుతం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఒకటి దేశీయ, రెండోది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సేవలు అందిస్తోంది. మరో దానిలో కార్గొ సేవలను నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో నుంచైనా చేరుకునేలా 56 రేడియల్ రోడ్లను నిర్మించారు. సమీప పర్యాటక ప్రాంతాలైన పథనంతిట్ట, ఎర్నాకులం, కొట్టాయం, అలిప్పి నుంచి నేరుగా చేరుకులా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారులను నిర్మించారు. ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించిన తొలి ఎయిర్ పోర్ట్ ఇది. 32 దేశాలకు చెందిన 10 వేల మంది ఎన్ఆర్ఐలు ఈ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇచ్చారు. కొచ్చీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రస్తుతం 31 అంతర్జాతీయ, 22 దేశీయ గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తిగా సోలార్ విద్యుత్తుతో నడిచే విమానాశ్రయాల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది.
పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల నేపథ్యంలో మామునూరు ఎయిర్ పోర్టు కూడా కొచ్చీ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలోనే నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమేరకు స్థల సేకరణ కూడా జరుగుతోంది. ఎయిర్‌పోర్టు వద్ద నిత్యం కార్యకలాపాలు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. విమాన రాకపోకలతోపాటు ఇతర కార్యకలాపాలకు, స్థానిక ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు, ఎయిర్ పోర్టు కు కూడా కనెక్టివిటీ రోడ్ల నిర్మానాణికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత దేశీయ విమానాల రాకపోకలకే టెర్మినళ్లు నిర్మిస్తారా? అంతర్జాతీయ టెర్మినళ్లను కూడా చేపడతారా అనేది తెలియాల్సి ఉంది.
…………………………………………….