
– రేవంత్ సర్కారులోనూ పౌష్టికాహారం అంతేనా?
– ప్రభుత్వ దవాఖానాల్లోని ఆహారంలో నాణ్యత లేమి
– గర్భిణులు, బాలింతలకు దొరకని బలమైన తిండి
– మెనూ ప్రకారం అందితే అదృష్టమే
– కాంట్రాక్ట్ సంస్థలు వండిన అన్నానికి పరీక్షలు కరువు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్ అయింది. ఫుడ్ పాయిజన్‌తో ఏకంగా 70 మంది రోగులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. నిన్న ఆస్పత్రిని సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ అక్కడి భోజనం అందిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ పైన, సూపరింటెండెంట్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. డైట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన సరే కానీ.. అసలు సర్కారు దవాఖానాలో చికిత్స పొందుతున్న రోగులకు బలవర్ధకమైన ఆహారం అందుతుందా?, రేవంత్ రెడ్డి సర్కారు హయాంలోనైనా పరిస్థితి మారుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మెనూ ప్రకారం ఏదీ?
అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు రోగ నిరోధక శక్తి పెరిగేందుకు గాను బలవర్ధమైన ఆహారం అవసరం. పౌష్టికాహారం అందించాలి. ఈ మేరకు వైద్యాధికారులు రూపొందించిన మెనూ ప్రకారం ఆహారం ఉండాలి. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆహారం కాంట్రాక్టర్లుకు అప్పగించారు. వారేమో సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి రోగులకు మెరుగైన ఆహారం అందచడం లేదనే ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. మెనూ ప్రకారం ఆహారం సరఫరా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
పరీక్షలు కరువు
కాంట్రాక్టర్లు సరఫరా చేసే ఆహారాన్ని నిత్యం డైటీషియన్ పరీక్షించాల్సి ఉంటుంది. ఆర్‌ఎంఎ స్థాయి అధికారి నిర్దారించాల్సి ఉంటుంది. అయితే ఈ పర్యవేక్షణ అధికారులు ఎక్కడ సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. రోగులకు ఏ మేరకు మంచి పౌష్టికమైన ఆహారం అందుతుందో పరిశీలించడం లేదు. దీంతో రోగులకు మెరుగైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు కిచెన్‌లో పరిశుభ్రత పాటించడం లేదు. ఆహారానికి మంచినీటి, నాణ్యత కూరగాయాలను సక్రమంగా వినియోగించడం లేదు. ఒక సారి వినియోగించిన నూనె పలు మార్లు వాడుతున్నారు. పలు చోట్ల సరిపోయిన ఆహారం, నీళ్ల మాదిరిగా చారు, నీళ్ల లాంటి పాలను సరఫరా చేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పెడితేనే..
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం లభించడం లేదు. రెండు సార్లు కడుపునిండా భోజనం అందడం లేదని చాలా మంది వాపోతున్నారు. ఇచ్చింది, పెట్టింది సరిపెట్టుకోవాల్సిందే అన్న పరిస్థితులు ఉన్నట్లు రోగుల సహాయకులు పేర్కొంటున్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రిలో గర్బిణులు, బాలింతలకు సరైన భోజనం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గర్భింతలు, బాలింతలకు పౌష్టికరమైన ఆహారం అందించాలి. అప్పుడే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు. వారి కోసం ప్రత్యేక డైట్‌ను వైద్యులు నిర్ణయిస్తున్నారు. దాని ప్రకారం వారికి ఆహారం ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. కానీ ఆచరణలో గర్బిణులు, బాలింతలకు పౌష్టికరమైన ఆహారం అందడం లేదు. ఏదో నామికేవాస్తే పడుతున్నాం కదా ! అన్నట్లు భోజనం పెట్టి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారని చాలా మంది రోగులు వాపోతున్నారు. పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు కూడా తమకేమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కారు అయినా ఈ దుస్థితిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
……………………………………………………..