* 2 లక్షల రుణమాఫీ చేసిన వివరాలు ఆయనకు పంపుతాం
* హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ రేవంత్ రెడ్డి
* 2029లో అసలు ఫైనల్స్ ఉన్నాయి..
* 15 పార్లమెంట్లలో నెగ్గి ఢిల్లీలో జెండా ఎగురవేయాలని పిలుపు
* ఫైనల్స్ పూర్తయ్యే వరకూ కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించొద్దని సూచన
* మా కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరూ.. మా జోలికి వస్తే చింతపండు చేస్తరు..
* ఘనంగా మహేశ్‌కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం
* సమయం వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న ఆ వ్యక్తి ఎక్కడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CHIEF MINISTER REVANTHREDDY) ప్రశ్నించారు. రుణమాఫీ వివరాలు ఆయనకు పంపుతామంటూ బీఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు(EX. MINISTER HARISHRAO)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని, 2029లో నరేంద్రమోడీ(NAREDRA MODI)ని గద్దె దించి ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి రాహుల్‌గాంధీ(RAHULGANDHI)ని ప్రధానమంత్రిని చేసినప్పుడే ఫైనల్స్ లో నెగ్గినట్లు అని చెప్పారు. తెలంగాణ నుంచి 15 పార్లమెంట్లు నెగ్గి, ఢిల్లీకి పంపేవరకు అందరం సమన్వయంతో పనిచేస్తూనే ఉండాలని కార్యకర్తలకు సూచించారు. అప్పటి వరకు ఎవరూ విశ్రమించొద్దని, ఎవరూ సెలవు తీసుకొద్దని తెలిపారు. ఇలాంటి సమయంలో మహేష్‌గౌడ్ భుజస్కందాలపై గురుతర బాధ్యత ఉందని తెలిపారు. రానున్న 3, 4 నెలల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసి, ఆ తర్వాత ఎంపీటీపీసీ, సర్పంచ్ల ఎన్నికలు నిర్వహిస్తామని, కార్యకర్తల కోసం అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ కష్టపడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
38 నెలల పాటు పీసీసీ అధ్యక్షుడిగా..
38 నెలల పాటు టీపీసీసీ చీఫ్(TPCC CHIEF)గా ముందుకు సాగానని, పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. పదేళ్లలో వేర్వేరు కారణాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందని చెప్పారు. ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ విజయంలో కార్యకర్తలదే కీలకపాత్ర అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినం.. చేసి చూపించినం.. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని నిరూపించినం.. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం.. పేద మహిళలకు 500కే గ్యాస్ ఇస్తున్నాం.. అని వివరించారు.
మా కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్..
మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరని, కానీ, ఎవరైనా మా జోలికి వస్తే చింతపండు అవుద్ది అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని ఉదహరించారు. సవాళ్లు విసిరారని, తర్వాత చింతపండు అయిందని బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలను సరిదిద్దాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) ఉద్యోగాలు ఊడాయి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.
నేతల మధ్య విభేదాలు ఉన్నా మేమంతా ఒక్కటే : మహేష్‌గౌడ్
కాంగ్రెస్ లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని, నేతల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, సమయం వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే అని టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్(TPCC NEW CHIEF MAHESHKUMAR GOUD) తెలిపారు. తాను టీపీసీసీ చీఫ్ అవుతానని ఊహించలేదని చెప్పారు. అందరం సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ప్రమాణస్వీకార సమయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ చీఫ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్, మాజీ ఎంపీలు కే.కేశవరావు, వీహెచ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
————————————