* కేటీఆర్ పై సాఫ్ట్ కార్నర్ వెనుక కారణాలేంటి?
* సస్పెన్షన్ తర్వాత కవిత స్వరం మారిందా?
* ఇదంతా కేసీఆర్ వ్యూహమా?
* కవిత ప్రెస్‌మీట్‌పై భిన్న వాదనలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
భారతీయ రాష్ట్ర సమితిలో కేసీఆర్ తర్వాత మరో కీలకమైన నేత తన్నీరు హరీశ్‌రావు. రాజకీయాల్లో పట్టు, ప్రజల్లో బలం ఉన్న నేత కూడా. కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంలో.. రాబోయే రోజుల్లో హరీశ్‌రావు పార్టీలో కీలకంగా మారబోతున్నారని, ఆయనే పార్టీని ముందుకు నడిపించే వ్యక్తి అన్న ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే కేసీఆర్-హరీశ్‌రావుల మధ్య గ్యాప్ వచ్చిందని ఊహాగానాలు వెలువడ్డాయి. కాళేశ్వరం ఇష్యూ వచ్చే వరకూ వారిద్దరూ కలిసిన సందర్భాలు కూడా తక్కువే. అలాంటి సమయంలో నాటి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే కేసీఆర్ కు కవిత రాసిన లేఖ అనూహ్యంగా బయటకు వచ్చిన నాటి నుంచీ హరీశ్‌రావుతో పాటు కేటీఆర్ పై కూడా ఆమె విమర్శలు మొదలుపెట్టారు. పార్టీని నడిపే సామర్థ్యం లేని వారు తనకు నీతులు చెబుతున్నారని, ఆడ బిడ్డకే అండగా లేని వారు నాయకుడు ఎలా అవుతారని కేటీఆర్‌పై పరోక్షంగా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
అన్నా.. జాగ్రత్త
ఇది ఇలా ఉంటే.. కవితను పార్టీని సస్పెండ్ చేస్తూ బీఆర్ ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆమె మీడియా ముందుకు వచ్చి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె పలువురు కీలక నేతలపై తీవ్రమైన విమర్శలు చేశారు. అన్నా.. నాపై కుట్రలు జరుగుతుంటే మీరేం చేశారని కేటీఆర్ ను ప్రశ్నిస్తూనే ఆయనకు కొన్ని సూచనలు చేశారు. పార్టీని, నాన్న ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు అంటూ పేర్కొన్నారు. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది.. అంటూ పేర్కొన్నారు. నా ప్రాణం పోయినా.. కేసీఆర్, కేటీఆర్ కు హాని చేయాలని కోరుకోనని కవిత అన్నారు. అంతేకాదు.. తమది రక్త సంబంధం అని, పదవులు పోతేనే, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పోయే బంధం కాదని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ పై ప్రేమ.. హరీశ్‌పై ఆగ్రహం
ఈ సమావేశంలో కేటీఆర్‌పై కవిత కాస్త సాఫ్ట్ కార్నర్ ను ప్రదర్శించారు. అదే సందర్భంలో హరీశ్‌రావుపై ఆరోపణల అస్త్రాలను సంధించారు. డబ్బు, అధికారమే ఆయన పరమావధి అని అన్నారు. అధికారం కోసం మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారని, మమ్మల్ని విడగొడతేనే వారికి అధికారం వస్తుందని ఆలోచిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇలా హరీశ్‌ను కవిత ప్రధాన టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావు బీఆఎస్ పార్టీలో కీలకం. కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన వెంటనే ఉన్నారు. సహజంగానే ఆయనకు పార్టీపై పట్టు ఉంటుంది. నిజానికి హరీష్ రావుపై ఇప్పటి వరకూ నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు లేవు. ఇతర పార్టీల నేతలు కూడా ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు. ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని ఎవరూ ఆరోపణలు చేయలేదు. గత రెండు, మూడేళ్లలో ఆయన భార్య ఓ పాలడైరీని ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు.అంతకు మించి హరీష్ బిజినెస్‌లపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు లక్ష కోట్ల కాళేశ్వరం అవినీతికే హరీష్ దే కీలక పాత్ర అని కవిత అంటుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా ఓ వ్యూహమా?
బీఆర్ ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతి నాటి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే హరీశ్ రావును కేసీఆర్ కాస్త దూరం పెట్టినట్లు కనిపిస్తుంది. రెండో సారి గెలిచిన తర్వాత చాలా కాలం మంత్రి పదవి ఇవ్వలేదు. పెద్దగా ప్రాధాన్యత కల్పించినట్లు కూడా కనిపించ లేదు. ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి పంపేసిన తర్వాతనే ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. అయితే హరీశ్ రావు.. ఎప్పుడూ పార్టీకి కానీ.. కేసీఆర్, కేటీఆర్ కు కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హరీష్ పై పెరుగుతున్న విమర్శలు రావడం వెనుక భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. వివాద, అవినీతి రహితుడిగా, పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న హరీశ్‌రావుపైనే కవిత ఎక్కువగా గురిపెట్టడం అన్నకు సహాయం చేసేందుకే అన్న కొత్త తరహా చర్చ మొదలైంది. ఇదంతా కేసీఆర్ వ్యూహమే అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. పలు ఆరోపణలను, ఘటనలను సాకుగా చూపించి పార్టీలో హరీశ్‌రావుకు ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ తర్వాత కవిత మళ్లీ పార్టీలోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని బహిరంగంగానే అంటున్నారు. రాజకీయాల్లోనే ఏదైనా జరగొచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
……………………………….
