
* బిహార్ పర్యటనలో ఓ ఆహార పదార్థాన్ని వెల్లడించిన ప్రధాని
* 365 రోజుల్లో 300 రోజులు తన మెనూలో ఉంటుందని వెల్లడి
* ఆ ఫుడ్ ఎందుకంత స్పెషలో గూగుల్ చేస్తున్న నెటిజన్లు
ఆకేరు న్యూస్ స్పెషల్ స్టోరీ :
బిహార్‌లోని భాగల్పుర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయం వెల్లడించారు. ఓ ఆహార పదార్థం గురించి చెబుతూ అది సూపర్ ఫుడ్ అన్నారు. 365 రోజుల్లో కనీసం 300 రోజులు అది ఆహారంలో భాగమయ్యేలా చూసుకుంటానని వివరించారు. ఆ ఆహారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఆయనే కాదు.. దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజల అల్పాహారంలో ఆ పదార్థం ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని అంతలా వల్లె వేసిన ఆ ఆహార పదార్థం గురించి ఆహారప్రియులు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ప్రధాని ఈ వయసులో కూడా చురుకుగా ఉండడానికి అదే కారణమా.. అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆహార పదార్థం ఏంటి? దాని ప్రయోజనాలపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
మఖానా పుట్టినిల్లు బిహార్‌లోని మధుబనీ
సూపర్ ఫుడ్ గా ప్రధాని పేర్కొన్న పదార్థం మఖానా. వాస్తవానికి ఇది చాలా మంది తెలిసినదే. అయితే ఎప్పుడో అప్పుడు మినహా రెగ్యులర్ గా తినేవారు చాలా మంది ఉంటారు. దీని ప్రత్యేక ఏంటంటే అల్పాహారంలాగే కాకుండా టైం పాస్ స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న మఖానా సాగు పుట్టినల్లు బిహార్‌లోని మధుబనీ. చెరువులు, బురదనీటి కుంటల్లో సైతం కనిపించే తామర పూల నుంచే ఈ మఖానా వస్తాయి. అయితే అన్ని రకాల తామర పూవుల నుంచి కాదు. పూల్ మఖానా తయారయ్యేది యూరియల్ ఫారెక్స్, ప్రిక్లీ అనే తామర పూల నుంచే. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఈ మఖానాలో 90 శాతం భారతదేశానిదే అయితే, అందులో 85 శాతం బిహార్ రాష్ట్రానిదే. మిథిలా మఖానా పేరుతో జీఐ ట్యాగ్ నూ ఈ ప్రాంతం సొంతం చేసుకుంది. అందుకే మోదీ కూడా నిన్న మాట్లాడుతూ బిహార్ లో మఖానా బోర్డు ఏర్పాటుకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాలు మరింత మెరుగు పడతాయని వివరించారు.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మఖానాలో పైబర్ అధికంగా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీంట్లో గొప్ప ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. ఖనిజ పదార్ధాలు ఉన్నాయి. కారణంగా బాగా ప్రాచుర్యం పొందింది. తక్కువ కేలరీల పవర్‌హౌస్‌గా ఉండటం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు, ఈ ‘మ్యాజిక్ నట్’ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. మఖానాలో విటమిన్ ఎ, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను దెబ్బతీస్తాయి. రోజూ ఒక గుప్పెడు వాటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మీకు యవ్వనమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని ఇచ్చే గొప్ప యాంటీ ఏజింగ్ ఫుడ్ కూడా అని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ పడుకునే ముందు మఖానాను ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. దీంతోపాటు యోగా లేదా ధ్యానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.
అటెన్షన్ ప్లీజ్..
మఖానాలు తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
* వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. అధిక వినియోగం వల్ల మలబద్ధకం, ఉబ్బరం సమస్యలు ఏర్పడతాయి.
* గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
* అధిక వినియోగం వల్ల శరీరంలో అధిక వేడి పెరుగుతుంది.
* మధుమేహం ఉన్న వారు కూడా వైద్యుడి సలహా మేరకే వీటిని స్వీకరించాలి. ఎందుకంటే ఇవి మీ ఇన్సులిన్ స్థాయిలను ప్రేరేపించవచ్చు.
* నాణ్యత లేని లేదా కలుషితమైన మఖానాలు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
……………………………………….