* మరి రేషన్‌కార్డుల దరఖాస్తుల సంగతేంటి?
* ప్రజాపాలనలో ఇచ్చినవి పరిగణనలోకి తీసుకుంటారా?
* నేటితో ముగియనున్న పైలట్ ప్రాజెక్టు
* రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక
* ఆ తర్వాతే తుది నిర్ణయం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇప్పుడంతా డిజిటల్ యుగం. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతా డిజిటల్ అంటోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డును తెరపైకి తెస్తోంది. ఒక్క క్లిక్‌తో అన్ని పథకాలనూ ప్రజలకు చేరువ చేస్తామంటోంది. ఒక్కో వ్యక్తికి ఒక్కో నంబర్ కేటాయించి, అందరికీ సంక్షేమాన్ని చేరవేస్తామంటోంది. ఈ మేరకు ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు నేటితో ముగియనుంది. స్థానిక అధికారులు వాటిని అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే.. అన్ని పథకాలకూ ఒకటే కార్డు అనేది వినడానికి బాగానే ఉంది కానీ, ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను గుర్తిస్తారు? ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం చేసిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారా? డిజిటల్ కార్డులు అందరికీ ఇస్తారా లేక కేవలం సంక్షేమ పథకాలకు అర్హులైనవారికేనా? వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
239 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్
వన్ స్టేట్.. వన్ కార్డు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బాటలో నడుస్తోంది. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య, ఆర్థిక వివరాలన్నింటినీ డిజిటల్ రూపంలో భద్రపరచనుంది. ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ పథకాలు, రేషన్‌కార్డు, హెల్త్ ప్రొఫైల్.. ఇలా 30 శాఖలకు చెందిన 30 రకాల సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేయనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 239 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో పటాన్చెరు ( గౌతమ్‌నగర్), మల్కాజ్గిరి (గాయత్రినగర్), కుత్బుల్లాపుర్(అయోధ్యనగర్), కూకట్పల్లి(సంగీత్‌నగర్), ఉప్పల్( భవానినగర్), ఎల్బీనగర్(జనప్రియ హోమ్స్), మహేశ్వరం(టెలిఫోన్ కాలనీ), రాజేంద్రనగర్( గుమ్మకంద కాలనీ), శేరిలింగంపల్లి (పీజేఆర్ కాలనీ), ముషీరాబాద్(శ్రీనివాసపురం కాలనీ), మలక్‌పేట( వాహెద్‌నగర్), అంబర్‌పేట(ఖాద్రీబాగ్), ఖైరతాబాద్(లక్ష్మీనగర్), జూబ్లీహిల్స్ (కృష్ణానగర్), సనత్‌నగర్( సైంటిఫిక్ కాలనీ), నాంపల్లి (ఏపీహెచ్‌బీ కాలనీ), కార్వాన్(బాగ్దాద్ కాలనీ), గోషామహల్( హిందీనగర్), చార్మినార్( మోతిగల్లీ), చాంద్రాయణగుట్ట(గులాం ముర్తుజా కాలనీ), యాకుత్‌పురా( నెహ్రూనగర్), బహదూర్‌పురా( రామ్నాస్పుర), సికింద్రాబాద్(మహ్మద్‌గూడ), కంటోన్మెంట్( అంజయ్యనగర్) ప్రాంతాల్లో చేపట్టారు.
నేటితో ఆఖరు
నేటితో సర్వే పూర్తి కానుంది. స్థానిక అధికారులు ఉన్నత అధికారులకు రిపోర్టు అందజేయనున్నారు. అనంతరం ప్రభుత్వానికి చేరనుంది. అందులోని లోటుపాట్లను సరిదిద్ది.. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టనున్నారు. అనంతరం ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందిస్తారు. ఈ డిజిటల్ కార్డులో కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ నంబర్ ఉంటుంది. అన్నీ కలిపి చూపించేలా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీకి వస్తున్న పథకాలు, ఏ పథకానికి అర్హులో, రేషన్ కార్డు ఉందా లేదా అనే వివరాలు ఇట్టే తెలిసిపోతాయని అధికారులు అంటున్నారు. డిజిటల్ కార్డు సర్వే, ప్రభుత్వ పథకాల అమలుకు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది.
దశల వారీగా డిజిటలైజేషన్..
రేషన్ కార్డు, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను ప్రస్తుతానికి తొలి దశలో డిజిటలైజేషన్ చేయాలని చూస్తున్నారు. డిజిటల్ కార్డుల్లో రేషన్ కార్డుల దారుల వివరాలు, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల వివరాలు, పొందుపరుస్తారు. తర్వాత ఆరోగ్య శ్రీ, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ లబ్ధిదారుల పేర్లు చేరుస్తారు. అనంతరం పింఛన్ దారుల వివరాలు పొందుపరుస్తారు. ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొ పథకం లబ్ధిదారులు చేరుస్తూ వెళ్తారు. ఒకేసారి అందరి వివరాలు చేర్చడం ఇబ్బంది అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ తరహా విధానం ద్వారా తమకు రేషన్‌కు అర్హత వస్తుందా లేదా అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తులు తీసుకుని రిఫరెన్స్ నంబరు కూడా ఇచ్చారు. మరి వాటిని ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలో అప్పటి వరకు కొత్తవారు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడాల్సిందేనా వేచి చూడాలి.
……………………………