
* హరిహర వీరమల్లు చుట్టూ వివాదాలు
* కట్టుకథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తారా?
* ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సీపీఎం డిమాండ్
* బహిష్కరించాలని వైసీపీ పిలుపు
* ఇది ఒక మెసేజ్ ఓరియంటల్ సినిమా అంటున్న జనసేన
* సినిమాను సినిమాగా చూడాలంటున్న వీక్షకులు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
హరి హర వీరమల్లు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ద స్టేట్స్ గా మారిన సినిమా. సుదీర్ఘ విరామం తర్వాత తమ అభిమాన నటుడు తెరపై కనిపించడంతో హీరో పవన్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవ్. టికెట్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తూ.. ధర ఎంతయినా బెదరకుండా.. బుకింగ్స్ ఓపెన్ కాగానే హాట్ కేకుల్లా కొనేశారు. తొలిరోజు డివైడ్ టాక్ తో సినిమా దూసుకెళ్తోంది. సినిమా పరంగా రికార్డులు.. కలెక్షన్లు ఎలా ఉన్నా రాజకీయంగా దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఊహాజనితమైన కాల్పనిక కథలతో ప్రజల్లో అపోహలను సృష్టించడం తగునా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చిత్రం ఏదైనా ఆపేరులోనే ఉంది.. అన్నీ చిత్ర విచిత్రాలే ఉంటాయనే అర్థం. అందుకనే కొన్ని పీడియాట్రిక్ చిత్రాలకు ప్రారంభానికి ముందే.. కథానుసారం కొన్ని కల్పితాలు చొప్పించామని నిర్మాతలు ప్రకటిస్తారు. ఆస్కార్ బరిలో నిలిచిన త్రిబుల్ ఆర్ నుంచి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి వరకు చాలా కథల్లో కల్పితాలు కామన్. అయితే.. హరిహర వీరమల్లు చిత్రం హీరో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి నాయకుడు కావడంతో కొంచెం ఎక్కువ చర్చ జరుగుతోంది.
ధర్మం కోసం పోరాడే యోధుడు కథ హరి హర వీరమల్లు!!
చిత్రం ప్రారంభం రోజు జనసేన పార్టీ కేంద్రం కార్యాలయం పేరుతో జనసేన, పవన్ అభిమానుల వాట్సప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అదేమిటంటే..
ధర్మం కోసం పోరాడే యోధుడు కథ హరి హర వీరమల్లు!!
పార్టీ శ్రేణుల అందరికీ నమస్కారం
పార్టీ కేంద్ర కార్యాలయ సూచనల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం
హరి హర వీరమల్లు ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరు మీ అభిమానాన్ని చాటుకునే విధంగా మీ జిల్లాల్లో హరిహర వీరమల్లు జూలై 24న సినిమా విడుదల అయినా మొదటి షో రోజున థియేటర్ల వద్ద, జనసేన పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు, మీ జిల్లా నియోజకవర్గంలోని థియేటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మొదటి షోలో పాల్గొని బయటికి వచ్చిన అనంతరం సమాజానికి ఇది ఒక మెసేజ్ ఓరియంటల్ సినిమా అని సోషల్ మీడియా మరియు ప్రెస్ మీట్ లో సినిమా గురించి ప్రచారాన్ని చేయండి.. మరియు దుష్ప్రచారం చేసే వాళ్లకి సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వండి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేసుకోండి.. అని ఆ మెసేజ్ సారాంశం.
సినిమా పరంగా, రాజకీయంగా కూడా పవన్ మైలేజీ పెంచుకోవాలనే తాపత్రయం అందులో కనిపిస్తోంది. అయితే ఇది సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చే సినిమా ప్రచారం చేయాలని పర్టిక్యులర్ గా పేర్కొనడం ఆలోచించాల్సిన విషయమని .. ఇప్పుడు ఇదే చర్చకు దారి తీస్తోంది.
ఎవరి వాదనలు వారివి..
జనసేన.. పవన్ అభిమానుల ఆలోచన ఒకలా ఉంటే.. విశ్లేషకులు, చరిత్రకారులు, కమ్యూనిస్టుల విమర్శలు మరోలా ఉన్నాయి. 1355లో మరణించిన హరిహర వీరమల్లు (కల్పిత పాత్ర).. 1618లో పుట్టిన ఔరంగజేబు(చారిత్రక వ్యక్తి)తో యుద్ధం ఎలా చేస్తాడు? అలాగే 1591లో నిర్మించిన చార్మినార్ అప్పుడు ఎలా ఉంటుంది. ఇది చారిత్రక మూవీనా, హిందు-ముస్లింల మధ్య మతచిచ్చు పెట్టడానికి తీసిన మూవీనా? అనే ప్రశ్నలను చాలామంది లేవనెత్తుతున్నారు. అందులోనూ కొంత కాలం పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. చాలా సందర్భాల్లో కూటమి పార్టీ అయిన బీజేపీ వలే కాషాయికీరణ రాజకీయాలూ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వచ్చిన ఈ సినిమాలోనూ మతచిచ్చు పెట్టేలా కొన్ని అంశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన, పవన్ అభిమానులు మాత్రం.. ఏ మతాన్నీ తక్కువ చేయకుండా, హిందుత్వం గొప్పతనాన్ని చాటి చెప్పారని అంటున్నారు.
మత విద్వేషాలకు ఆజ్యం పోస్తుంది : సీపీఎం లేఖ..
‘హరిహర వీరమల్లు’ సినిమాపై సీపీఎం కూడా స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేరుగా పవన్ కల్యాణ్‌కే లేఖ రాశారు. ” మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన ‘హరిహర వీరముల్లు’ చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ అని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను. బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ‘హరిహర వీరమల్లు’ పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు, వాస్తవాలకు కట్టు కథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి’అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కోహినూర్ వజ్రం ఎక్కడ నుంచి ఎటుగా ఎక్కడికి వెళ్లిందో కూడా ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్న మీరు.. కట్టుకథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి , ప్రజలకు నష్టమని గుర్తించాలని శ్రీనివాసరావు ఆ లేఖలో సూచించారు. మొత్తంగా హరిహర వీరమల్లుగా తనదైన శైలిలో హీరోయిజం చూపించిన పవన్.. ఓ ప్రజాప్రతినిధిగా, ఉపముఖ్యమంత్రిగా విమర్శలూ ఎదుర్కొంటుండడం గమనార్హం.
……………………………………………….