
* విమానాశ్రయ విస్తరణకు కేంద్రం ఆమోదం
* ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఆకేరున్యూస్, ఢిల్లీ: వరంగల్ నగర ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎయిర్పోర్ట్ కల నెరవేరబోతోంది. వరంగల్ జిల్లాలోని మామూనూర్‌లో విమానాశ్రయ అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శంషాబాద్ నుంచి 150 కిలోవిూటర్ల దూరంలో మరో ఎయిర్‌పోర్టు ఉండరాదని జిఎంఆర్ సంస్థ గతంలో ఒప్పందం చేసుకుంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం, రామ్మోహన్నాయుడు చర్చల తర్వాత జిఎంఆర్ సంస్థ కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో విమానాశ్రయ పనులు చేపట్టేందుకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 696 ఎకరాల స్థలం ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమి కొంత రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్‌స్టుమ్రెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ మేరకు భూసేకరణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసింది. జీఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.
………………………………..