* అతి పెద్ద పేరు సరే.. నిర్వహణ తీరెలా?
* మహానగరం ముంగిట పెను సవాళ్లు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవతరించింది. ఔటర్ రింగు రోడ్డు పరిధేకాదు.. అవతల ఉన్న కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను ఇందులో కలిపేసింది. దీంతో మహా నగర విస్తీర్ణం మూడింతలు దాటింది. ఇప్పటి వరకు 7000 చ.కి.మీలు న్న నగరం.. ఇప్పుడు సుమారు 2,700 చ.కి.మీలతో నయా నగరంగా రూపాంతరం చెందింది. ఇంత వరకు గొప్పగానే ఉంది. చెప్పుకోవడానికే సంచలనంగానే ఉంది. అయితే.. వాటి నిర్వహణ ఎలా.. విభాగాలు ఎలా.. పాలన ఎలా.. అనే అంశాలపై తీసుకునే నిర్ణయాలను బట్టే మహ మహానగర అభివృద్ధి ముడిపడి ఉంటుంది.
డివిజన్లు.. సమస్యలూ మూడింతలు..
150 డివిజన్లు గల జీహెచ్ఎంసీలోనే ఎన్నో లోపాలు వెలుగుచూస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిన పరిస్థితులను ఎన్నోసార్లు చూశాం. మురుగు పొంగులు రోడ్లపై పారుతుండడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక సగటు నగరజీవి అసహనాన్ని పరిశీలిస్తున్న ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు వచ్చినా, మెట్రో వంటి అధునాతన రవాణ వ్యవస్థ రూపొందించినా ట్రాఫిక్ ఇక్కట్లు తొలగడం లేదు. రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో పాటు, పట్టణ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయలేకపోతుండడంతో ఈ సమస్య సమసిపోవడం లేదు. ఇప్పుడు ఈ మహా నగరం.. మహ మహానగరంగా మారుతున్న సమయాన సంతోషంతో పాటు ఒకింత ఆందోళన కూడా సగటు నగరవాసిలో కనిపిస్తోంది. ఇప్పటికీ సవాల్ విసురుతున్న వ్యర్థాల నిర్వహణ, రహదారుల ధ్వంసం, మురుగు పొంగులు వంటి సమస్యలు హైదరాబాద్ అతిపెద్ద నగరంగా మారుతున్న క్రమంలో డివిజన్లు మూడింతలు కానున్నాయి. ఈక్రమంలో సరైన ప్రణాళిక లేకుంటే సమస్యలూ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జనాభా 2 కోట్లకుపైగా..
అంతేకాదు.. పారిశుధ్య నిర్వహణ పెనుసవాలుగా మారనుంది. పెరుగుతున్న జీవన వ్యయం వంటి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. పట్టణ ప్రణాళిక అమలు పకడ్బందీగా లేకపోతే ఇవి మరింత సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు. రోడ్లు , మౌలిక సదుపాయాలనా అంతే. నిర్వహణలో లోపాలు ఉన్నాయి. నగరంలో పెరుగుతున్న జనాభాకు అవి సరిపోవడం లేదు. నయా నగరంలో జనాభా సుమారు 2 కోట్లకు చేరనుంది. ఆ జనాభాకు అనుగుణంగా నయా ప్రణాళికలు లేకపోతే ప్రస్తుతం ఉన్న సమస్యలు రెట్టింపు కానున్నాయి.
మాస్టర్ ప్లాన్ బట్టే..
జీహెచ్ఎంసీ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని ఒకే విధమైన పరిపాలన, పట్టణ ప్రణాళికల అమలు, నిధుల వ్యయం, మెరుగైన మౌలిక వసతుల కల్పన చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన జీవోలో పేర్కొంది. స్థానిక మునిసిపాలిటీల్లో ఉండే ప్రస్తుత పరిపాలన కంటే అత్యుత్తమ పరిపాలన, ఉన్నతాధికారులతో సమన్వయం చేయడం ద్వారా పట్టణీకరణకు మేలు చేసేలా జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు రవాణా సదుపాయం, అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ధి చెందేందుకు మాస్టర్ ప్లాన్ను రూపొందించడం వంటివి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అమలు తీరును బట్టే అతి పెద్ద నగరం ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుంది.
…………………………………………………………..
