సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కిలాడీ లేడీ కలకలం..
డాక్టర్ వేషంలో వచ్చి నగలు దోపిడీ!
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం అపహరణ..
యశోద ఆసుపత్రిలో దారుణం
వైద్యురాలిగా నటిస్తూ భారీ చోరీ
సికింద్రాబాద్ యశోదలో రోగిని ముంచిన మహిళ.
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యశోదలో భారీ చోరీ కలకలం సృష్టించింది. వైద్యురాలి అవతారమెత్తిన ఓ కిలాడీ మహిళ, చికిత్స పొందుతున్న రోగిని బురిడీ కొట్టించి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలతో పరారైంది. రోగికి మత్తు మందు ఇచ్చి మరీ ఈ దోపిడీకి పాల్పడటం స్థానికంగా సంచలనంగా మారింది.
వైద్యురాలి గెటప్‌లో వచ్చి..
పాత బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న ఆమె గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తెల్లకోటు ధరించి, స్టెతస్కోప్‌తో డాక్టర్లా వేషధారణలో వచ్చిన ఓ గుర్తు తెలియని మహిళ సుధారాణి గదిలోకి ప్రవేశించింది. లోపల ఉన్న రోగి బంధువులను పరీక్షల పేరుతో బయటకు పంపించి, గదిలో సుధారాణి ఒక్కరే ఉన్న సమయంలో ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది.
క్షణాల్లో మాయమైన 10 తులాల బంగారం….
రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, ఆ కిలాడీ మహిళ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. సుధారాణి ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను వేగంగా దోచుకుని అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లిన కుటుంబ సభ్యులు సుధారాణి స్పృహ లేకుండా పడి ఉండటం, ఒంటిపై నగలు లేకపోవడాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆసుపత్రి భద్రతపై ప్రశ్నలు…
వెంటనే అప్రమత్తమైన బాధితులు ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీయగా, సదరు మహిళ తమ ఆసుపత్రి సిబ్బంది కాదని వారు నిర్ధారించారు. ఇంతటి పెద్ద ఆసుపత్రిలో ఒక అపరిచిత మహిళ డాక్టర్ వేషంలో యథేచ్ఛగా తిరుగుతూ, రోగి గదిలోకి వెళ్లి మత్తు మందు ఇచ్చే వరకు ఎవరూ గమనించకపోవడంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో భద్రతా వైఫల్యాలను ఈ ఘటన ఎత్తిచూపుతోంది.
కేసు నమోదు – రంగంలోకి పోలీసులు….
బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితురాలు లోపలికి ఎలా వచ్చింది? ఆమెకు ఎవరి సహాయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితురాలిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
