
* ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి
* నాయకులు ప్రజలతో మమేకమవ్వండి
* స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటండి
* ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కార్యకర్తలే పార్టీకి ఆయువు పట్టని, కార్యకర్తల శ్రమతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ మంత్రులు దామోదర్ రాజ నరసింహ,కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ… కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్తకు అండగా నిలబడుతూ సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు తీసుకోవాలన్నారు.నాయకులు హైదరాబాద్ నుంచి కదిలి క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలని ఆదేశించారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.నాయకులంతా విబేధాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
………………………………………………….