yb satyanarayana my father baliah
* మూడు తరాల పోరాటం
* అంటరానితనం నుంచి ఉన్నత విద్య దాకా..
* తండ్రి జీవితాన్ని సామాజిక చరిత్రగా మలిచిన వైబీ సత్యనారాయణ
* అనారోగ్యంతో హాస్పిటల్లో మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఊరి వెలుపల నివాసం.. చదువుకోవడానికి అడ్డంకులు.. సాటి మనుషులను తాకడానికి కూడా కులం పేరుతో నిషేధాలు. అలాంటి పరిస్థితుల్లో జీవించిన ఓ దళిత కుటుంబం నుంచి ఉన్నత విద్యావంతులు, అధ్యాపకులు ఎలా ఎదిగారు? ఆ మార్పు వెనుక ఒక తండ్రి ఎంత కష్టపడ్డాడు..? ఈ ప్రశ్నలకు తన కుటుంబ జీవితాన్నే వైబీ సత్యనారాయణ సమాధానంగా అందించారు. ఆయన రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ (My Father Baliah), తెలుగులో ‘మా నాయన బాలయ్య’గా పాఠకులకు చేరింది. తండ్రి జ్ఞాపకాలతో మొదలైన ఈ రచన, తెలంగాణలో కులవివక్షను ఎదుర్కొంటూ ఎదిగిన మూడు తరాల జీవితాలను పరిచయం చేసింది. బుధవారం వైబీ సత్యనారాయణ ( 82 ) హైదరాబాద్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
* కబాలి తో మరింతమందికి పరిచయం
2011లో హార్పర్కాలిన్స్ ప్రచురించిన ఈ ఆంగ్ల రచనను ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి తెలుగులోకి అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ‘మా నాయన బాలయ్య’ పేరుతో జూన్ 2013లో తొలి తెలుగు ముద్రణను తీసుకొచ్చింది. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్ ‘కబాలి’ చిత్రంలో ఈ పుస్తకాన్ని చూపించడం ద్వారా మరింతమంది దృష్టి దీనిపై పడింది. ఓ తెలంగాణ దళిత కుటుంబ జీవన పోరాటం, సినిమా ద్వారా విస్తృత ప్రేక్షకులకు పరిచయమైంది. బాలయ్య తన పిల్లలకు అందించాలని ప్రయత్నించినది చదువుకునే అవకాశం. ఆ అవకాశం వెనుక ఉన్న తండ్రి శ్రమను, తాత వలసను, కుటుంబం ఎదుర్కొన్న కులవివక్షను సత్యనారాయణ అక్షరబద్ధం చేశారు. అందుకే ‘మా నాయన బాలయ్య’ చదువుతో జీవితాలను మార్చుకున్న ఒక కుటుంబ కథగా, సమాన అవకాశాలు ఎందుకు అవసరమో వివరించే సామాజిక సాక్ష్యంగా నిలిచింది.
* అవమానాలే అక్షరాలైనాయి
సత్యనారాయణ వృత్తిరీత్యా రసాయనశాస్త్ర అధ్యాపకుడు. రసాయనశాస్త్రంలో డాక్టరేట్ పొందిన ఆయన హైదరాబాద్లోని ధర్మవంత్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. . దళితుల సామాజిక అభ్యున్నతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, దళిత అధ్యయన కేంద్రం (Centre for Dalit Studies) సహ వ్యవస్థాపకుడు.
ఆయన కుటుంబ మూలాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామంలో ఉన్నాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఈ కుటుంబం అనుభవించిన అవమానాలు, గ్రామాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు, రైల్వే ఉద్యోగాలతో మొదలైన మార్పు ఆయన రచనకు పునాది. తాను ఉన్నత విద్యను అందుకోవడం వెనుక తండ్రి బాలయ్య పట్టుదల ఎంత ఉందో ఈ పుస్తకంలో వివరించారు.
* అమెరికా మనవరాళ్ళ కోసం రాశాను
అమెరికాలో పెరుగుతున్న తన మనవరాళ్లకు కుటుంబ చరిత్ర అర్థమయ్యేందుకు ఆంగ్లంలో రాసినట్లు సత్యనారాయణ పుస్తకం ముందుమాటలో పేర్కొన్నారు. అంటరానితనం ఎంత అమానుషమైనదో చెప్పడం ఆయన మరో లక్ష్యం. తరతరాల అణచివేత వల్ల బాధితులే తమకు జరిగే అన్యాయాన్ని సహజమైన పరిస్థితిగా అంగీకరించాల్సి వచ్చిన వాస్తవాన్ని కూడా ఈ రచన వెలికి తీసిందని చెప్పాలి . అందుకే ఇందులో కుటుంబ జ్ఞాపకాలతోపాటు, ఆ కుటుంబాన్ని నియంత్రించిన సామాజిక పరిస్థితులూ కనిపిస్తాయి.
* ఊరు వదిలిన నర్సయ్య.. మారిన కుటుంబ భవిష్యత్తు
సత్యనారాయణ తాత నర్సయ్య కుటుంబానికి నిజాం ఇచ్చిన భూమిని స్థానిక భూస్వామి చేజిక్కించుకోవడం, గ్రామంలోని కులపీడన ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. భార్య మరణం తరువాత చిన్న కుమారుడితో గ్రామాన్ని వదిలి వెళ్లడం ఆ కుటుంబ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది. నర్సయ్యకు రైల్వేలో దొరికిన చిన్న ఉద్యోగం కొత్త జీవనానికి దారి చూపుతుంది. గ్రామంలో కులవృత్తి, భూస్వామి ఆధిపత్యం చుట్టూ తిరిగిన జీవితంలోకి వేతన ఉద్యోగం ప్రవేశిస్తుంది. ఈ మార్పు కుటుంబానికి కొంత ఆర్థిక స్థిరత్వంతోపాటు, తరువాతి తరాలకు చదువు అందుకునే అవకాశాన్ని కల్పించింది . రైల్వే, విద్యాసంస్థల వంటి వ్యవస్థలు ఆ కుటుంబ సామాజిక ఎదుగుదలకు ఎలా దోహదపడ్డాయన్న అంశాన్ని పరిశోధకులు కూడా ప్రత్యేకంగా విశ్లేషించారు.
* బాలయ్య పట్టుదల.. పిల్లలు చదవాల్సిందే
నర్సయ్య కుమారుడు బాలయ్య కూడా రైల్వేలో ఉద్యోగంలో చేరారు. రైలు గార్డుల సామాన్ల పెట్టెలను మోసే ‘బాక్స్మన్’గా పనిచేశారు. ఆయనకు, పిల్లల భవిష్యత్తును మార్చే మార్గం చదువేనన్న నమ్మకం ఏర్పడింది. తనకు పరిమితంగా అందిన విద్యను పిల్లలకు ఉన్నతస్థాయి వరకు అందించాలని నిర్ణయించుకున్నారు.
తక్కువ ఆదాయం, పెద్ద కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకోవడమే పుస్తకంలోని ప్రధాన పోరాటం. పిల్లలు త్వరగా సంపాదనలోకి రావాలన్న అవసరం ఉన్నా, వారి చదువును కొనసాగించేందుకు బాలయ్య శ్రమించారు. చివరకు కుటుంబంలో పలువురు ఉన్నత విద్యను అభ్యసించి, కొందరు డాక్టరేట్లు సాధించి అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. తండ్రి పట్టుదల కుటుంబ స్థితిగతులను ఎలా మార్చిందో సత్యనారాయణ తన అనుభవాలతో చూపించారు.
* వెంటాడిన కులం…
చదువు ప్రారంభమైనంత మాత్రాన అవమానాలు ముగిసిపోలేదు. పిల్లల పలకలను నీళ్లు చల్లి తాకే ఉపాధ్యాయులు, ఉద్యోగాల్లో ఎదురైన వివక్ష, అద్దె ఇంటి కోసం కులాన్ని దాచుకోవాల్సిన పరిస్థితులను పుస్తకం నమోదు చేస్తుంది. పేదరికం నుంచి బయటపడే ప్రయత్నంతోపాటు, మనిషిగా గౌరవం పొందడానికి కూడా పోరాడాల్సి వచ్చింది. బాల్యంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి సోఫాలో కూర్చున్నందుకు బయటకు పంపించిన ఘటన వంటి అనుభవాలు రచయితను వెంటాడాయి. సంస్థ అధిపతిగా ఎదిగిన తరువాత కూడా తన సామర్థ్యంపై కులపరమైన అనుమానాలను ఎదుర్కోక తప్ప లేదు. ఆర్థిక ఎదుగుదల సాధించినా సామాజిక సమానత్వం కోసం ప్రయాణం కొనసాగుతుందన్నది ఈ ఘట్టాల నుంచి కనిపించే అంశం. అదే సమయంలో తమకు అండగా నిలిచిన వివిధ కులాలు, మతాలకు చెందిన ఉపాధ్యాయులు, స్నేహితులను కూడా సత్యనారాయణ మరచి పోలేదు. వివక్షను నమోదు చేస్తూనే, దాన్ని అధిగమించడానికి చేయూతనిచ్చిన మనుషుల పాత్రనూ వివరించడం సత్యానారాయణ గొప్పతనం
————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.

