
* ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా
* వాలెగాం గ్రామస్థుల నిర్ణయం
ఆకేరు న్యూస్ నిర్మల్ : ఆ గ్రామంలో చిరు వ్యాపారులకు, బిక్షాటనకు ఒక సమయం.. ఉల్లంఘిస్తే జరిగేదిదే!సహజంగా గ్రామాలలో గ్రామ సంబంధిత అనేక విషయాలను గ్రామ ప్రజలకు తెలియజేయడానికి అనేక ప్రత్యేకమైన బోర్డులను పెడతారు. బస్టాండులు, ప్రయాణ ప్రాంగణాలు, గుళ్ళు, కార్యాలయాలు తదితర ప్రదేశాలలో ఏదైనా విషయం చెప్పాలనుకుంటే గమనిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించే ఒక బోర్డు దర్శనమిస్తుంది.
వాలేగాం (walegam) గ్రామ తోరణం వద్ద ఆసక్తి కలిగించే గమనిక బోర్డు
ఆ బోర్డులో రాసి ఉన్నది చదివితే అసలు ఎందుకిలా చేసారు అబ్బా అని ప్రతి ఒక్కరు ఆలోచించేలా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ (nirmal) జిల్లా బైంసా(bhainsa) మండలం వాలేగాం గ్రామ తోరణం వద్ద గ్రామస్తులు, vdc సభ్యులు కలిసి ఒక ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేశారు. ఇక ఆ బోర్డులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
చిరు వ్యాపారులు, భిక్షాటన చేసేవారికి నిబంధనలు
గమనిక.. చిరు వ్యాపారులు, భిక్షాటన చేసేవారు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే గ్రామంలో సంచరించాలి. మిగతా సమయంలో సంచరిస్తే వారికి 500 రూపాయలు జరిమానా విధిస్తాం ఇట్లు వి డి సి మరియు గ్రామ ప్రజలు అంటూ ఆ బోర్డులో పేర్కొన్నారు.
దొంగతనాల నేపధ్యంలో గ్రామస్తుల నిర్ణయం
గ్రామాలలో రోజురోజుకీ చిరు వ్యాపారాలు చేసే వారి సంఖ్య, భిక్షాటన చేసే వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఆ గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో రాత్రి వేళలో కాకుండా పట్టపగలు కూడా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు ఆలోచించి గ్రామంలోకి కొత్తగా వస్తున్న వారు ఎవరు? వారు ఏ పేరుతో గ్రామంలోకి వస్తున్నారు? అనేది గుర్తించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే 500 జరిమానా
గ్రామంలోకి వస్తున్న చిరు వ్యాపారస్తులు, భిక్షాటన చేసేవారు ఒక సమయం ప్రకారమే వచ్చి వెళ్లాలని వారు సూచించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని కూడా ఆ గమనిక లో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నిర్ణయం గ్రామంలో దొంగతనాలను తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం అని గ్రామస్తులు భావిస్తుంటే, పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్లపైన, తినడానికి తిండి లేక భిక్షాటన చేసే వాళ్లపైన ఈ నిబంధన దేనికి అని చిరు వ్యాపారులు, భిక్షాటన చేసేవారు ప్రశ్నిస్తున్నారు.
………………………………………………..