
* డ్యూటీ డ్రైవర్లకు ఫోన్ నిషేధం
* తెలంగాణ ఆర్టీసీలో కీలక నిర్ణయం
*సెప్టెంబర్ 1 నుంచి అమలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విధులు నిర్వహించే డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్లు ఉండకూడదని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీ ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్లను ఉపయోగించడాన్ని సెప్టెంబరు 1వ తేదీ నుంచి నిషేధించింది. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను ఎంపిక చేశారు. వాటిలో హైదరాబాద్-ఫరూక్నగర్, సికింద్రాబాద్-కూకట్పల్లి, మహబూబ్‌నగర్-కొల్లాపూర్, మెదక్- సంగారెడ్డి. నల్గొండ-మిర్యాలగూడ, రంగారెడ్డి-వికారాబాద్, ఆదిలాబాద్ ఉట్నూరు, కరీంనగర్-జగిత్యాల, ఖమ్మం-ఖమ్మం, నిజామాబాద్-కామారెడ్డి, వరంగల్-పరకాల డిపోల్లో అమలు చేస్తారు. డ్రైవర్లు విధుల్లో చేరే ముందు తమ ఫోన్లను డిపోలో భద్రతాధికారి వద్ద డిపాజిట్ చేసి, విధులు ముగిసిన అనంతరం తిరిగి ఫోన్లను తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది. అత్యవసర సమయాల్లో డ్రైవర్లకు సమాచారం. అందించేందుకు డిపోలలో ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్‌ను అందుబాటులో ఉంచుతారు. ఈ నెంబరుకు సమాచారమిస్తే సంబంధిత బస్సు కండెక్టర్ ద్వారా ఆయా బస్సు డ్రైవర్‌తో మాట్లాడిస్తారని చెబుతున్నారు.
…………………………………………