* అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన యువ క్రికెటర్ గొంగడి త్రిష ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసిన త్రిషను సీఎం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
కోటి రూపాయల ప్రోత్సాహకం..
జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి త్రిష ప్రతిభను కొనియాడుతూ కోటి రూపాయల నజరానా ప్రకటించారు. భవిష్యత్తులో భారత జట్టును మరింతగా గెలిపించాలని ఆమెకు ప్రోత్సాహం అందించారు. తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రికెటర్లు ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
ధృతి కేసరికి రూ. 10 లక్షల నజరానా
అండర్-19 మహిళల వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యురాలిగా నిలిచిన మరో తెలంగాణ క్రీడాకారిణి ధృతి కేసరిని కూడా సీఎం అభినందించారు. ఆమె ప్రతిభను గుర్తిస్తూ 10 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు.
కోచ్, ట్రైనర్లకు కూడా ప్రోత్సాహం
కేవలం క్రీడాకారులకే కాకుండా, వారిని తీర్చిదిద్దిన కోచ్‌లు, ట్రైనర్లకు కూడా గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వం యొక్క లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అండర్-19 మహిళల టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినిలకు చెరో 10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. మహిళా క్రీడాకారుల ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ‘‘మహిళా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఆటగాళ్లకు ఉత్తమ శిక్షణ, ప్రోత్సాహకాలు అందజేస్తుందని సీఎం తెలిపారు.
………………………………….