* సోషల్‌మీడియా మాధ్యమాల ద్వారా చాటింగ్
* ఆపై తీయగా మాట్లాడి చీటింగ్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
‘‘అందమైన అమ్మాయి.. ఆపై మంచిగా మాట్లాడుతోంది.. సుద్దులు.. బుద్దులూ చెబుతోంది. అంతేకాదు.. ఆదాయం వచ్చే మార్గాలను కూడా చక్కగా వివరిస్తోంది.’’ అని ఆమె వలలో పడ్డారా తస్మాత్ జాగ్రత్త. మీ కొంప కొల్లేరు అవుతుంది. మీ ఖాతా ఖల్లాస్ అవుతుంది. మీ సొమ్ము ఆవిరవుతుంది. ఈ తరహా కిలాడీ లేడీలు ఇప్పుడు చాలా మందే వెలుగులోకి వస్తున్నారు. సోషల్‌మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ ద్వారా అమాయకులకు వల విసిరి తీయని మాటలతో ఆకట్టుకుంటున్నారు. వ్యాపారం, లాభాల పేరుతో ముగ్గులోకి దించి ఉన్నదంతా దోచుకుంటున్నారు.
ఫేస్‘బుక్’ చేసింది!
ఫేస్బుక్లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్బుక్లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి అని, తనది వైజాగ్ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది. పరిచయం పెరిగిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడులు, వ్యాపారం గురించి చెప్పడం ప్రారంభించింది. స్వల్ప కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించింది. ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించింది. దీంతో అతడు రూ.10.21లక్షలు పెట్టుబడి పెట్టాడు. అందుకు 14వేల యూస్ డాలర్లు (రూ.12.04 లక్షలు) లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపించింది. వాటిని విత్‌డ్రా చేయకుండా ఆప్షన్ క్లోజ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆదాయం పన్నులు, ఇతర ట్యాక్స్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదేదో సైబర్ మోసం అని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో కేసులో రూ.12.56 లక్షలు స్వాహా
ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.12.56 లక్షలను కాజేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు సెప్టెంబర్ ఒకటిన ఇన్‌స్టాగ్రాంలో ఆన్లైన్ ట్రేడింగ్ యాడ్‌ను చూశాడు. మోతీలాల్ ఓస్వాల్ లోగో ఉన్న దానిపై క్లిక్ చేశాడు. అనంతరం వాట్సాప్‌లో ఎల్47 క్వాంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు క్రియేట్ అయింది. స్టాక్స్ కొనుగోలు ద్వారా మంచి లాభాలు వస్తాయని అందులో మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. నిజమేనని నమ్మిన బాధితుడు ఎంఓడీఎంఏ యాప్ ద్వారా విడతల వారీగా రూ.12,56,900 పెట్టుబడి పెట్టాడు. లాభంతో కలిపి రూ.46,89,375లు వచ్చినట్లు వర్చువల్‌గా కనిపించింది. డబ్బులను డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, మరో రూ.7.60లక్షలు పెట్టుబడి పెట్టాలని ఓ యువతి ఫోన్ వచ్చింది. ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
………………………………………………………..
