* చంద్రముఖిని నిద్రలేపినట్లే
* చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ బంద్
* 99 శాతం మేనిఫెస్టోను అమలు చేశా
* తాడిపత్రి సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
ఆకేరు న్యూస్, తాడిపత్రి : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును ( Chandra babu ) నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టినట్లే అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( YS Jagan ) విమర్శించారు. జగన్ కు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. తాడిపత్రి వైఎస్ ఆర్ సర్కిల్ లో ఆదివారం నిర్వహించిన జగన్ ప్రచార భేరీ సభలో జగన్ మాట్లాడారు. కూటమి వాళ్లు గుంపులు, గుంపులుగా వస్తున్నారని, మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకుని సింగిల్గానే వస్తున్నాడని చెప్పారు. 2.70 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో బటన్ నొక్కి వేశామన్నారు. ఎన్నడూ లేని రీతిలో 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలను ఇచ్చామని వివరించారు. ఇంటి వద్దకే పథకాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పారు. లంచాలు లేకుండా పనులు జరుగుతోంది.. కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే అన్నారు.
పశుపతిని ఇంటికి పిలుస్తారా..?
తాడిపత్రి సభ వేదికగా చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబునాయుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, ఆయనను నమ్మవద్దని తెలిపారు. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టినట్లే అని, చంద్రముఖిని నిద్రలేపినట్లే అని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే.. పశుపతిని ఇంటికి పిలిచినట్లే అని చెప్పారు. తన పొత్తు మంచిచేసే ప్రజలతోనే అని వెల్లడించారు. తనకున్న నమ్మకం ఈ ప్రజలు.. ఆ దేవుడి దయ మీదే అన్నారు. మంచి చేసిన తర్వాతే ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా మహిళా సాధికారితను తీసుకొచ్చామన్నారు. గ్రామంలోనే మహిళా పోలీస్ ఎప్పుడైనా ఊహించారా అని తెలిపారు. పంట వేసే సమయంలోనే రైతన్నకు పెట్టుబడి సాయం అందుతోందని చెప్పారు.
—————-