* రైల్వేస్టేషన్ లోనే ప్రయాణికుల పడిగాపులు
ఆకేరు న్యూస్, డెస్క్: మొంథా తుఫాను కారణంగా చాలా చోట్ల రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. మొంథా తుపాను, వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.. ఫలక్నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (Sounth Central Railway) ప్రకటించింది. కాగా.. వర్షాల కారణంగా పలు రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో భారీగా వరదనీరు చేరింది. భారీ వర్షాలు వరదలతో.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్ప్రెస్, డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ఏపీ(AP)లోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఏపీలోని పలు స్టేషన్లలో భారీ సంఖ్యలో గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో రైల్వేస్టేషన్లలోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు భారీ వర్షం, రాకపోకల బంద్ కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణ కూడా స్తంభించింది. దిక్కుతోచని స్థితిలో కొందరు ప్రైవేటు వాహనాల్లో ఆగి ఆగి ప్రయాణిస్తున్నారు.
………………………………………………..
