* ట్రాక్టర్ బోల్తాపడి 13 మంది దుర్మరణం
* సంతోషకర సమయంలో తీవ్ర విషాదం
* రాష్ట్రపతి, ఎంపీ సీఎం సంతాపం
ఆకేరు న్యూస్ డెస్క్ :
మంగళవాయిద్యాలతో సాగాల్సిన ఆ పెళ్లి ఊరేగింపులో మరణమృదంగం మోగడం కలిచివేసింది. మృత్యుఘోష తీవ్ర దిగ్బ్రాంతిని మిగిల్చింది. పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఏకంగా 13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. పెళ్లి ఊరేగింపు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ కు వెళ్తోంది. ఈ ఊరేగింపు రాజస్థాన్‌లోని హర్నవాడ రోడ్డులోని మోతీపురా నుంచి కమల్‌పురా వైపు సాగుతోంది. ఈ రెండు గ్రామాలు రాష్ట్రాల సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి. పెళ్లి అతిథులతో నిండి ఉన్న ట్రాక్టర్.. పిప్లోడా సమీపంలోని ఛాయాన్ రోడ్డు వద్ద పడింది. 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 12 మందికి గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతులను, క్షతగాత్రులను అరడజను అంబులెన్స్‌లలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. సంఘటనా స్థలంలో కలెక్టర్‌తో పాటు నాయకుడు నారాయణ్‌సింగ్ పన్వార్, ఎస్పీ రాజ్గర్ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మ ప్రభుత్వ అధికారులు రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సమాచారం అందుకున్న రాజస్థాన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాధాకరం
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారనే వార్త చాలా బాధాకరమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
——————–