
* చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సృష్టి కేసు నిందితులను గోపాలపురం పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టయిన నిందితులకు మారేడుపల్లి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను చంచల్గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టి పోలీసులు, వైద్యాధికారులు పలు కీలక పత్రాలను, వీర్య కణాల శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు, సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్కు మధ్య సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. సరోగసి పేరిట పలువురి నుంచి వీర్యం, అండాలను సేకరించి గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్లు తేలింది. అనుమతులు లేకుండా రెజిమెంటల్ బజార్లో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థను నిర్వహిస్తున్న ఆ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీతోపాటు జితేందర్, శివ, మణికంఠ, సంపత్, శ్రీను, బోరోను అరెస్టు చేశారు. కాగా, తొమ్మిదేళ్ల క్రితమే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేయగా, డాక్టర్ నమ్రత అక్రమంగా అనుమతులు పొంది మళ్లీ నిర్వహిస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఎవరైనా దంపతులు వస్తేనే.. డాక్టర్ నమ్రత విజయవాడ నుంచి వస్తుండటం గమనార్హం.
……………………………………..