* సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు అందంచకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్, మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను కేసీఆర్ ప్రారంభించిన 1962 – పశువైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు సైతం పొంది దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన గొప్ప కార్యక్రమ నిర్వహణను గాలికి వదిలేసి మూగజీవుల రోదనకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే ఆశయం నీరుగారిపోతుండగా.. మరోవైపు వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారన్నారు. వైద్య సిబ్బంది కుటుంబపోషణ భారంగా మారి ఆవేదన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఉద్యోగ సిబ్బందికి పెండిరగ్ వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
……………………………..