
మహారాష్ట్ర పూణేలో పెట్రోలింగ్ చేస్తున్న బైకును ఢీకొట్టిన కారు, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల మృతి.
* సీసీ పుటేజీలో కారును కనుగొన్న పోలీసులు
ఆకేరు న్యూస్ డెస్క్ : దూసుకొచ్చిన కారు పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్నఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున బొపోడి అండర్‌పాస్ సమీపంలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేస్తున్న బైక్‌ను ఒక కారు ఢీకొట్టింది. దీంతో 42 ఏళ్ల కానిస్టేబుల్ సమాధాన్ కోలీ అక్కడికక్కడే మరణించాడు. 36 ఏళ్ల మరో కానిస్టేబుల్ సంజోగ్ షిండే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు స్పందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. పోలీసులు ఉన్న బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయిన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణానికి కారణమైన నిందితుడు సిద్ధార్థ రాజు కెంగార్ అలియాస్ గోత్యా (24)ను అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రమాదం సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా అన్నది తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఆ సమయంలో ఆ కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
————————————–