Warangal Government Schools Closure
ఆకేరు న్యూస్, వరంగల్: తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. తాజా గణాంకాల ప్రకారం, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,441 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జీరో ఎన్రోల్మెంట్’ నమోదైంది. అంటే ఈ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి గానూ ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోలేదు.
*వరంగల్ మొదటి స్థానంలో ఉంది..
ఈ ‘జీరో ఎన్రోల్మెంట్’ సంక్షోభం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల కంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అత్యధిక పాఠశాలలు మూతపడి మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం 3,369 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఏకంగా 474 పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి.
*జిల్లాల వారీగా మూతపడిన స్కూళ్ల వివరాలు..
ఉమ్మడి వరంగల్ పరిధిలోని జిల్లాల్లో జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడిన పాఠశాలల గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి:
మహబూబాబాద్ జిల్లా: 167 పాఠశాలలు
వరంగల్ జిల్లా: 135 పాఠశాలలు
జనగామ జిల్లా: 70 పాఠశాలలు
హన్మకొండ జిల్లా: 36 పాఠశాలలు
ములుగు జిల్లా: 36 పాఠశాలలు
భూపాలపల్లి జిల్లా: 30 పాఠశాలలు
*సర్పంచ్లకే ఆ బాధ్యత…
రాష్ట్రవ్యాప్తంగా జీరో ఎన్రోల్మెంట్తో మూతపడిన 1,441 పాఠశాలలను నిర్వీర్యం కాకుండా కాపాడుకునేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలల్లో తిరిగి విద్యార్థులు చేరేలా చూసి, వాటిని మళ్లీ పునఃప్రారంభించే (తెరిపించే) పూర్తి బాధ్యతలను స్థానిక సర్పంచ్లకు అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగేలా విద్యాశాఖ, స్థానిక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
