* ఏపీలో అరుదైన వివాహం
ఆకేరున్యూస్ డెస్క్: ఆ తాతకు 64 ఏళ్లు.. బామ్మకు 68 ఏండ్లు.. వయసైపోయి వృద్ధాశ్రమానికి చేరిన వారిద్దరూ అక్కడే ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకుడికి చెప్పడంతో తోటి వృద్ధుల సమక్షంలోనే దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నారాయణపురానికి చెందిన మడగల మూర్తి (64) రెండేళ్లుగా ఉంటున్నాడు. కొంతకాలం క్రితం మూర్తి తీవ్ర పక్షవాతానికి గురయ్యాడు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్పా కదల్లేని పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో అదే ఆశ్రమంలో ఉంటున్న వైఎస్ఆర్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ (68) అతనికి అండగా నిలబడిరది. రాత్రి పగలు తేడా లేకుండా అన్నీ తానై మూర్తికి సపర్యలు చేసింది. రాములమ్మ సహకారంతో మూర్తి తొందరగానే కోలుకున్నాడు.
దీంతో తనను కంటికి రెప్పలా కాపాడిన రాములమ్మను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని రాములమ్మతో చర్చించగా.. ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో తన నిర్ణయాన్ని ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో అతని నిర్ణయంతో ఏకీభవించి వృద్ధ జంటకు పెళ్లి చేశాడు.
………………………………………..