* తెలంగాణలో మరో భారీ స్కామ్
* గొర్రెల పంపిణీలో రూ.700 కోట్లు కొట్టేశారు..
* తలసాని మాజీ ఓఎస్డీ అరెస్టుతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఉన్నతస్థాయి అధికారుల హస్తం ఉన్నట్లు బయటపడింది. తొలుత సుమారు రూ.2 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. 2 కాదు.. ఏకంగా రూ. 700 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టు తేల్చింది. ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్టవగా, ఇప్పుడు ఏకంగా సీఐవో స్థాయి అధికారి, మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ ని ఏసీబీ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ను, పశు గణాభివృద్ధి సంస్థ సీఐవో రాంచందర్ నాయక్ ను ఏసీబీ అధికారులు చేసిన విచారణలో రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.
కేసు నమోదు ఇలా..
2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేసింది. అయితే కొందరు అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంపై కేసు నమోదైంది. దీనిలో అధికారుల పాత్ర ఉందని భావిస్తూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. పశు సంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి, అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని రూ.2 కోట్లు మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి.
కాంట్రాక్టర్ ను కదిపితే..
లబ్దిదారులకు అందించేందుకు గొర్రెల సేకరణను గత ప్రభుత్వం మొయినుద్దీన్ అనే కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఈ కుంభకోణంలో అతడే కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి సేకరించిన సమాచారం, రికార్డుల ఆధారంగా రాంచందర్, కల్యాణ్‌ల పాత్ర తేటతెల్లమైంది. నాంపల్లి ఏసీబీ కేసుల న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం అధారంగా రాంచందర్, కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రాంచందర్‌ను అరెస్ట్ చేసేందుకు అధికారులు మాసబ్‌ట్యాంక్‌లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. తమ వెంట రావాలని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదు. చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది అడ్డుతగిలినా, వెనక్కి తగ్గని ఏసీబీ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించి రాంచందర్‌ను అరెస్ట్ చేశారు. రాంచందర్, కల్యాణ్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు. రాంచందర్, కల్యాణ్‌ను విచారించిన అనంతరం మరికొందరును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
—————–