Bathukamma| ఆకేరు న్యూస్, హనుమకొండ: బతుకమ్మ వేడుకలు హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ఆటపాటలు, జానపద గీతాలు, కోలాటాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
సంప్రదాయాలకు అద్దం పట్టిన సంబరాలు
గత 50 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా తంగేడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలు సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, చప్పట్లు కొడుతూ, కోలాటాలు ఆడుతూ పండుగ ఉత్సాహాన్ని చాటుకున్నారు.
చారిత్రక ఆలయ శిల్పకళా సౌందర్యం, విద్యుత్ దీపాల వెలుగులు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. హనుమకొండ నగర మహిళలతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నగరపాలక సంస్థ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
బతుకమ్మ పాటల పోటీల్లో మహిళల ప్రతిభ
గత పదేళ్లుగా రాదేశ్యాం సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పాటల పోటీలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో మహిళలు తమ మధురమైన జానపద గీతాలతో ప్రేక్షకులను అలరించారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ నేతృత్వంలో పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో విజేతలకు హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమ బహుమతులు అందజేశారు. పంచనేని సుమ ప్రథమ బహుమతి, కట్టా సౌజన్య ద్వితీయ బహుమతి, అంబటి గాయత్రి తృతీయ బహుమతి సాధించారు. ఇతర ప్రతిభావంతులకు సైతం కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.
మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
వేడుకల్లో పాల్గొన్న మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ధరణికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు ప్రసాద పంపిణీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రాదేశ్యాం సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు పల్లం రమేష్, తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి, బక్కి సతీష్, దేవాదాయ శాఖ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పుప్పాల ప్రభాకర్, బోడా దిన్న, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

