* వారణాసి సహా 57 కీలక స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్
* బీజేపీకి ఈ దశలో విపక్షాల నుంచి గట్టి పోటీ
ఆకేరు న్యూస్ డెస్క్ : సార్వత్రిక ఎన్నికల సమరంలో చివరి దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 11.31 శాతం పోలింగ్ నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ దశలో కేవలం 57 స్థానాలకే పోలింగ్ జరగనున్నప్పటికీ.. అధికార బీజేపీకి ఇది అత్యంత కీలకం కానుంది. ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలు, బిహార్‌లో 8, పశ్చిమబెంగాల్లో 9, ఒడిసాలో 6, జార్ఖండ్‌లో 3 స్థానాలతోపాటు పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 4 స్థానాలకు చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి.
పోటీలో ప్రధాని
ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని వారాణసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ పోటీలో ఉన్నారు. మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ (సోనీలాల్) అధినేత్రి, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ సిటింగ్ ఎంపీ రవికిషన్ పోటీ చేస్తున్నారు. ఇక బీఎస్పీ పలుచోట్ల దళితులను, ముస్లింలను అభ్యర్థులుగా నిలపడంతో.. వారు ఇండీ కూటమి ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. వారాణసి నుంచి రెండుసార్లు ఎన్నికైన నరేంద్రమోదీకి తిరుగులేనప్పటికీ.. పట్టువదలని విక్ర మార్కుడిలా పోరాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్ ఈసారి కాశీలో మార్పు కనిపిస్తోందని చెప్పుకొంటున్నారు. మోదీ స్థానికుడు కాదని, ‘బచేగా కాశీ.. హఠేగా ప్రవాసీ (ప్రవాసిని పక్కకు తప్పించి కాశీని కాపాడాలి)’ అంటూ ప్రచారం చేశారు.
——————–