* ప్రజలకు చట్టాలంటే భయం భక్తీ లేవు
* ఎన్ని చర్యలు చేపట్టినా 1.68 లక్షల మంది దుర్మరణం
* లోక్‌సభ లో వివరాలు వెల్లడించిన నితిన్ గడ్కరీ
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని, తానూ బాధితుడినేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)అన్నారు. దేశంలో ఈ ఏడాదిలో 1.68 లక్షల మంది దుర్మరణం చెందినట్లు లోక్‌సభ లో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మృతుల్లో 60శాతం మంది యువకులే ఉండడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా .. చట్టాలంటే ప్రజలకు భయం భక్తీ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు(Road Accidents) తగ్గడం లేదన్నారు. హెల్మెట్ పెట్టుకోని కారణంగా ఏటా 30వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. తానూ రోడ్డు ప్రమాద బాధితుడినేనని, మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందన్నారు.
కాగా, ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే లోపాలను ఎత్తి చూపుతూ ఇప్పటి వరకు 150 మంది మృతి చెందారని.. దౌసాలోనే 50 మందిపైగా మరణించారని నాగౌర్ ఎంపీ తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేపై నియమించిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు, విచారణ నివేదికకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన బదులిచ్చారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అని, ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో నిర్మించినట్లు గడ్కరీ(Gadkari) తెలిపారు. రూ.లక్ష కోట్ల ఖరీదుతో వేశామన్నారు. పలుచోట్ల రోడ్డు దెబ్బతిందని.. మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో నలుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులపైనా చర్యలు తప్పవన్నారు.
……………………………