* రేవంత్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు
* మేడ్చల్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుందన్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ .. 15 ఏండ్ల క్రితం తెలంగాణ కోసం ఉక్కు సంకల్పంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దీక్షకు దిగారని చెప్పారు. దీక్ష సఫలమైన ఈ రోజును విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నామనన్నారు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచి పోతుందన్నారు. కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కాళోజీ నారాయణ రావు పొగిడారని.. దేవతా రూపంలో ఉన్న తల్లిని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కృతి తెలంగాణదన్నారు. చూడగానే చెయ్యెత్తి దండం పెట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని.. కానీ రేవంత్‌రెడ్డి ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణను అవమానించేదిగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతిని అవమానించిన వారికి ధీటుగా సమాధానమిస్తామని తెలిపారు. తల్లులను మార్చే దుర్మార్గులు ప్రపంచంలో ఎక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి గానీ తల్లులు కాదన్నారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మను మాయం చేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మాయం చేయడమే అన్నారు.
………………………………..