* వసతి గృహాల్లో ఘనంగా ఏర్పాట్లు చేయాలి
* వచ్చే అతిధులకు మంచి భోజనం అందివ్వాలి
* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ఈ నెల 14న అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్, కెజిబివి పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డైట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయం నుండి 14న నూతన డైట్ కార్యక్రమం ప్రారంబించనున్నందున వసతి గృహల సంక్షేమ అధికారులు, రెసిడెన్షియల్, కెజిబివి పాఠశాలల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, కెజిబివి, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన జిల్లాలోని 61 పాఠశాలల్లో నూతన డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి సమక్షంలో వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించాలని సూచించారు. విద్యార్థులకు, వచ్చిన అతిధులకు బగారా రైస్, చికెన్, మిల్ మేకర్, సాంబార్, పెరుగు వంటి ప్రత్యేక వంటకాలతో తయారు చేసిన భోజనం వడ్డించాలని ఆయన స్పష్టం చేశారు. వంట శాలలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు కార్యక్రమ ప్రత్యేక అధికారులుగా వ్యవహరించాలని సూచించారు. ప్రిన్సిపాల్స్ పిల్లల తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చి ఆహ్వానించాలని పేర్కొన్నారు. శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తదితర ప్రముఖులు వస్తారని లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. క్వాలిటీ, క్వాన్టిటి పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లులకు వారి పిల్లల ఆహార అలవాట్లపై అవగాహన కల్పించడం, పౌష్టికాహారంపై శ్రద్ధ పెంచడం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ పండుగను పాఠశాలలలోనే కాకుండా విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా పాల్గొనేలా నిర్వహించాలని సూచించారు. ఏమి మెనూ ఇస్తున్నామో తల్లితండ్రులకు తెలియాలని, ఆ క్రమంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఈఓ రాజేందర్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు సునీత, శైలజ, పోశంతో పాటు అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, వసతిగృహాలు, రెసిడెన్షియల్, కేజీబీవీ, ప్రత్యేక పాఠశాలల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………